ప్రపంచ సినిమా చరిత్రలో ‘అవతార్’ది ఒక ప్రత్యేక అధ్యాయం. అప్పటిదాకా అలాంటి విజువల్ వండర్‌ను వెండితెరపై ఎవ్వరూ చూడలేదు. ఇక ఆ చిత్రం సృష్టించిన బాక్సాఫీస్ ప్రభంజనం గురించి ఎంత చెప్పినా తక్కువే. వరల్డ్ సినిమా కలెక్షన్ల రికార్డులన్నీ ఆ దెబ్బతో బద్దలైపోయాయి. ప్రాంతం, భాష అన్న భేదం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ఆదరించారు.
ఇండియాలో కూడా ఇది బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాకు ‘అవతార్’ అని పేరు పెట్టడం.. ఈ కథకు భారతీయ పురాణాలతో లింక్ ఉండడం మనవాళ్లు మరింత కనెక్ట్ అయ్యేలా చేసింది. ఐతే ఇప్పుడీ సినిమాకు సంబంధించి బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఈ సినిమాకు టైటిల్ సూచించింది తనే అని.. అంతే కాక దర్శక నిర్మాత జేమ్స్ కామెరూన్ తనకో ఆఫర్ చేస్తే తిరస్కరించానని గోవిందా చెప్పారు.
గోవిందా ఇచ్చిన ఒక బిజినెస్ ఐడియా వల్ల అమెరికాలో స్థిరపడ్డ ఒక సర్దార్ బాగా లాభపడ్డాడట. దీంతో అతను తనను జేమ్స్ కామెరూన్ దగ్గరికి తీసుకెళ్లి డిన్నర్ ఏర్పాటు చేసినట్లు గోవిందా వెల్లడించాడు. ఆ సందర్భంలోనే తనకు కామెరూన్ అవతార్ సినిమా గురించి వివరించారని.. అంతే కాక అందులో కీలకమైన స్పైడర్ పాత్రను ఆఫర్ చేశాడని గోవిందా తెలిపాడు. ఈ పాత్ర కోసం అప్పట్లోనే రూ.18 కోట్ల పారితోషకం కూడా ఇవ్వజూపారని.. కానీ చిత్రీకరణ కోసం 400 రోజులకు పైగా డేట్లు అడిగారని.. అంతే కాక పాత్ర కోసం ఒళ్లంతా పెయింట్ వేసుకోవాల్సి ఉంటుందని చెప్పడంతో తాను నో అన్నానని గోవిందా చెప్పాడు.
అలా పెయంట్ వేసుకుంటే తాను ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుందని చెప్పి ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు గోవిందా తెలిపాడు. అంతే కాక ఈ చిత్రానికి అవతార్ అనే టైటిల్ సూచించింది కూడా తనే అని గోవిందా చెప్పడం విశేషం. ఐతే ఈ వ్యాఖ్యల్ని సోషల్ మీడియా జనాలు నమ్మడం లేదు. గోవిందా చెబుతున్న విషయాలు నమ్మశక్యంగా లేవని వారంటున్నారు.