నాదెండ్ల మనోహర్. సీనియర్ పొలిటీషియన్ మాత్రమే కాదు. రాజకీయ వారసుడు కూడా. నాదెండ్ల భాస్కరరావు తనయుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన.. ఉమ్మడి ఏపీకి స్పీకర్‌గా కూడా పనిచేశారు. ఎంతో మేధావిగా కూడా పేరు తెచ్చుకున్నా రు. అంతేకాదు.. ఎంత తీవ్ర పరిస్థితులు ఎదురైనా ఎంతో సంయమనంతో వ్యవహరించే నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలకు.. రెచ్చిపోయే రకం కూడా కాదన్న పేరు కూడా ఉంది. అలాంటి నాయకుడి నోట.. తాజాగా విస్మయం కలిగించే వ్యాఖ్యలు వచ్చాయి. అంతేకాదు.. ఈ వ్యాఖ్యలు విపక్షాలకు మరింత పదునైన అస్త్రంగా మారే అవకాశం .. కూటమిలో కల్లోలం పుట్టించే అవకాశం ఉన్నాయన్న చర్చ సాగుతోంది.
ఏమన్నారు?
తాజాగా కాకినాడలో నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ఆయన రెండు కీలక విషయాలను ప్రస్తావించారు. దీనిలో 1) కూటమి ప్రభుత్వ ఏర్పాటు. ఈ విషయంపై మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ లేకపోతే.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడేది కాదని చెప్పా రు. అంతేకాదు.. చంద్రబాబు ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారన్నా.. కూడా పవన్ కల్యాణ్ చలవేనని చెప్పారు. బలమైన పోరాటం చేయడం వల్లే.. కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఆనాడు పవన్ కల్యాణ్ అనేక అవమానాలు ఎదుర్కొని రాష్ట్రంలో కూటమి కట్టేందుకు పార్టీలను ఒప్పించారని.. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందన్నారు.
ఇక, 2వ విషయానికి వస్తే.. పిఠాపురంలో పవన్ ను ఎదిరించే నాయకుడు ఎవరూ లేరని చెప్పుకొచ్చారు. “పిఠాపురం పవన్ అడ్డా. కాదని ఎవరు అంటారు“ అని నాదెండ్ల సంచలన వ్యాఖ్య చేశారు. పిఠాపురం ఎప్పటికీ పవన్‌తోనే ఉంటుందని.. ఇక్కడ మరో నాయకుడికి అవకాశం లేదని పరోక్షంగా టీడీపీ నేత, పవన్ కోసం టికెట్ త్యాగం చేసిన.. వర్మను ఉద్దేశించి నాదెండ్ల వ్యాఖ్యానించారు. అయితే.. నాదెండ్ల చేసిన వ్యాఖ్యలు.. సంచలనంగా మారి.. సోషల్ మీడియాలో విమర్శలకు దారి తీస్తున్నా యి. విజ్ఞులైన వారే.. ఇలా నోరు జారితే కూటమిలో ఇతర నాయకుల పరిస్థితి ఏంటని? చాలా మంది ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే కూటమిలో పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో కలివిడిగా లేరన్న చర్చ జరుగుతున్న సమయంలో నాదెండ్ల వంటి నాయకుడు ఇలాంటి వ్యాఖ్యానిస్తే.. మరింతగా చిచ్చు రాజుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఉద్దేశం ఏదైనా మాటలు జాగ్రత్తగా రావాల్సిన అవసరం ఉందని.. లేకపోతే.. వీటిని పట్టుకుని క్షేత్రస్థాయిలో నాయకులు మరింత దూకుడు ప్రదర్శిస్తే.. అన్ని పార్టీలతోపాటు రాష్ట్రానికి కూడా నష్టం వాటిల్లుతుందని అంటున్నారు. మరి దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.