మాజీ ఎమ్మెల్యే మరియు హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి తాజాగా తాను టీడీపీ లో చేరబోతున్నట్లు ప్రకటించారు. సోమవారం జూబ్లీహిల్స్ లోని నివాసంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తీగల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో సహా పలువురు నాయకులు భేటీ అయ్యారు.
భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన తీగల కృష్ణారెడ్డి.. తాను టీడీపీలో చేరబోతున్నానని వెల్లడించారు. చంద్రబాబు వల్లనే హైదరాబాద్ నగరంలో అభివృద్ధి జరిగిందని తీగల అన్నారు. తెలంగాణలో టీడీపీకి భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారని.. వారందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చి టీడీపీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీ పాలన రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఇక మల్లారెడ్డి తన మనవరాలు శ్రేయరెడ్డి పెళ్లికి ఆహ్వానించడం కోసం చంద్రబాబును కలిశారు. ముఖ్యమంత్రికి వివాహ శుభలేఖను అందజేశారు. కాగా, తీగల కృష్ణారెడ్డి రాజకీయ ప్రస్థానం మొదలైంది టీడీపీలోనే. అలాగే మల్లారెడ్డి, మాధవరం కృష్ణారావు కూడా గతంలో టీడీపీలో పని చేశారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణల కారణంగా పార్టీని వీడారు. ఇప్పుడు తీగల మళ్లీ సొంత గూటికే చేరుతున్నారు. మల్లారెడ్డి కూడా టీడీపీలో చేరనున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. కానీ ఆ అంశంపై మల్లారెడ్డి నోరు విప్పలేదు.