త్వరలో రాజ్య సభ ఎన్నికలు జరగబోతోన్న నేపథ్యంలో వైసీపీ తమ పార్టీ తరఫున ముగ్గురిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే, టీడీపీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తుందా? లేదా? అన్న విషయంపై సందిగ్ధత ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆ విషయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు క్లారిటీనిచ్చారు.రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదని చంద్రబాబు క్లారిటీనిచ్చారు. టీడీపీ అభ్యర్థిని పోటీకి పెట్టే ఆలోచన తమ పార్టీకి లేదన్నారు.
ఉండవల్లిలోని తన నివాసంలో యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, అనగాని, కంభంపాటి, గొట్టిపాటి తదితరులతో చంద్రబాబు భేటీ అయి వారితో ఈ విషయంపై చర్చించారు. ఇక, వైసీపీకి చెందిన చాలామంది కీలక నేతలు టీడీపీకి టచ్ లోకి వస్తున్నారని వారితో చంద్రబాబు అన్నారు. కానీ, వైసీపీ నుంచి రావాలనుకేనే నేతలందరినీ తీసుకోలేమని చెప్పారు. కొత్తగా పార్టీలో చేరే వైసీపీ నేతల వల్ల, జనసేనతో పొత్తుల వల్ల ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడ్డ నేతలకు నష్టం జరగకూడదని అభిప్రాయపడ్డారు. అన్ని విషయాలు లోతుగా చర్చించి, ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు ఉంటాయని అన్నారు. ‘రా కదలిరా’, ‘శంఖారావం‘ సభల గురించి, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల గురించి వారితో చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు.