హీరోయిన్ల కెరీర్లో కొంచెం ఊపు తగ్గుతున్నపుడు ఏదైనా కారణంతో బ్రేక్ తీసుకున్నారంటే అంతే సంగతులు. ఆ తర్వాత మళ్లీ అవకాశాలు రావడం కష్టమవుతుంది. సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో దశాబ్దంన్నర కాలం పాటు ఒక వెలుగు వెలిగిన సమంత కు ఇలాగే అనుకోకుండా కెరీర్లో గ్యాప్ వచ్చింది. అనారోగ్యం కారణంగా ఆమె ఆరు నెలలకు పైగా సినిమాలకు దూరంగా ఉంది.
దీంతో కొన్నాళ్ల పాటు ఆమెను అందరూ మరిచిపోయారు. అనారోగ్యం నుంచి కోలుకుని మామూలుగా కనిపిస్తున్నా.. ఫొటో షూట్ల ద్వారా గ్లామర్ డోస్ గట్టిగానే ఇస్తున్నా ఆమెకు అవకాశాలు రావట్లేదు. ఆల్రెడీ కమిటైన ప్రాజెక్టులు కూడా కొన్ని చేేజారినట్లు వార్తలు వచ్చాయి. దీంతో సమంత కెరీర్ ఇక పుంజుకోవడం కష్టమే అన్న అభిప్రాయం ఏర్పడింది. ఇలాంటి టైంలో సామ్ ఓ పెద్ద సినిమాలో ఛాన్స్ పట్టేసినట్లు వార్తలొస్తున్నాయి.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సినిమాలో సమంత మెరవబోతోందట. మమ్ముట్టి ప్రధాన పాత్రలో తమిళ సీనియర్ దర్శకుడు గౌతమ్ మీనన్ ఓ సినిమా రూపొందిస్తున్నాడు. ఈ చిత్రానికి ముందు నయనతారను కథానాయికగా అనుకున్నారు. కానీ ఏవో కారణాల వల్ల ఆమె తప్పుకుంది. తన స్థానంలోకి సమంత వచ్చిందన్నది తాజా సమాచారం. గౌతమ్ సినిమాల్లో లేడీ క్యారెక్టర్లు బలంగా ఉంటాయి. మెచ్యూర్డ్‌గా అనిపించే ఆ పాత్రలకు సీనియర్ హీరోయిన్లనే తీసుకుంటూ ఉంటాడతను.
కాబట్టి సమంతకు ఈ పాత్ర బాగా సూటయ్యే, ఆమె పెర్ఫామ్ చేయడానికి మంచి స్కోప్ ఉండే అవకాశముంది. ఈ సినిమా సంగతి పక్కన పెడితే.. తన సొంత బేనర్లో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను ఈ మధ్యే సమంత అనౌన్స్ చేసింది కానీ.. దాని గురించి వేరే అప్డేట్ ఏదీ బయటికి రాలేదు. నిజంగా ఆ సినిమా ఉందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.