ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నుంచి 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్నిచోట్ల క్లీన్ స్వీప్ చేసేసిన సంగతి తెలిసిందే. అలాగే జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికల ఫలితాల అనంతరం మంత్రివర్గ విస్తరణలో ఆయన కోరుకున్న స్థానాలతో పాటు డిప్యూటీ సీఎం పదవిని కూడా పవన్ కళ్యాణ్ సొంతం చేసుకున్నారు.
ఇక నేడు విజయవాడలో ఇరిగేషన్ ప్రాంగణంలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూ ఎస్, పర్యావరణ, శాస్త్రసాంకేతిక, అటవీశాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ డ్యూటీ ఎక్కేశారు. మొదట ఛాంబర్ లో ఇంద్రకీలాద్రికి చెందిన వేద పండితులు పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి పవన్ కళ్యాణ్ ను ఆశీర్వదించారు. ఆపై పవన్ డిప్యూటీ సీఎంగా, మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టారు.
డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పవన్ కళ్యాణ్ రెండు ఫైళ్లపై తన వదినమ్మ సురేఖ కానుకగా ఇచ్చిన పెన్ తో సంతకాలు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని ఉద్యాన వన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరు చేస్తూ తొలి సంతకం చేశారు. గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాలు నిర్మాణానికి పవన్ రెండవ సంతకం చేశారు. అలాగే నేడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశం కానున్నారు. ఇక రేపటి నుంచి తన పరిధిలో ఉన్న అన్ని శాఖలపై పవన్ ఫుల్ ఫోకస్ పెట్టబోతున్నారని తెలుస్తోంది.