బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాలు గంపెడాశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. వివిధ అంశాల్లో తమకు మంచి కేటాయింపులు ఉంటాయని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజలు ఆశించారు. అయితే, ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్లో మిగిలింది మాత్రం నిరాశే.
సహజంగానే ఈ బడ్జెట్‌పై విపక్షాలు విరుచుకుపడుతుంటే… అధికార బీజేపీ నేతలు సమర్థించేందుకు సతమతం అవుతున్నారు. ఇలాంటి సమయలో బీజేపీ మిత్రపక్ష పార్టీలపై అందరి చూపు పడుతుంది. బీజేపీతో దోస్తీ కట్టిన జనసేన పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది అనే ఆసక్తి అందరిలో నెలకొన్న సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం రాత్రి 9.40 నిమిషాల సమయంలో ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ ప్రకటన చూశాక… మోడీకి జగన్ కంటే పవన్ ఎక్కువ భయపడుతున్నాడని అనిపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే జగన్ జుట్టు మోడీ చేతిలో ఉన్న జగన్ బడ్జెట్ ను తిట్టకపోయినా పొగకుండా సైలెంట్ గా ఉన్నాడు. మరి పవన్ ఎందుకు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన బడ్జెట్ ను అంతగా పొగుడుతున్నాడో తెలియక జనం విస్మయానికి గురయ్యారు. ఒకవైపు కేసీఆర్ మోడీని రేవెట్టేసిన తర్వాత కూడా పవన్ ఇలా స్పందించడం ఆశ్చర్యకరం. ఇంతకీ పవన్ ఏమన్నాడో చూద్దాం.
ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసే ప్రయత్నం తాజా బడ్జెట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం చేసిందని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. ఉత్పాదక, వ్యవసాయ రంగాలను బలోపేతం చేయడం ద్వారా దేశ ప్రగతిని ముందుకు తీసుకువెళ్లే విధంగా కేంద్ర బడ్జెటును బీజేపీ ప్రభుత్వం రూపకల్పన చేయడం ఆశావహ పరిణామమని పవన్ కళ్యాణ్ విశ్లేషించారు. అయితే ఈ బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విభజన హామీలు, పోలవరం ప్రాజెక్ట్ వంటి అంశాలు చోటుచేసుకోకపోవడం కొంత నిరాశను కలిగించిందని పవన్ వ్యాఖ్యానించారు.
అభివృద్ధి చెందిన దేశాలతో మన భారతదేశం పోటీ పడే విధంగా ఒక గొప్ప దార్శనికతను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తోందని చెప్పడం అతిశయోక్తి కాదని పవన్ ప్రస్తావించారు. కాలానుగుణంగా మారుతున్న సాంకేతికతను దేశంలో ప్రవేశపెట్టడానికి సంకల్పించిన ప్రయత్నాలు మంచి ఫలితాన్ని అందిస్తాయని జనసేన భావిస్తోందని పవన్ వివరించారు.
“ప్రధానమంత్రి గతిశక్తి బహుళార్ధక పధకం దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇచ్చే విధంగా ఉంది. ముఖ్యంగా డిజిటల్ కరెన్సీ, డిజిటల్ బ్యాంకింగ్ కారణంగా వ్యాపార వ్యవహారాలు, నగదు లావాదేవీల్లో పారదర్శకత పెరిగి అవకతవకలు తగ్గే అవకాశం ఉంది. డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు కారణంగా దేశ సాంకేతిక అవసరాలు తీర్చగల మంచి ప్రమాణాలు కలిగిన టెక్కీలు రూపొందుతారు. ప్రాంతీయ భాషలలో విద్య బోధన కోసం 200 టి.వి.చానళ్ళు ప్రారంభించడానికి సంకల్పించడం ప్రాంతీయ భాషలలో విద్యార్జన చేయాలనుకునే వారికి మేలు కలిగిస్తుంది. రక్షణ రంగం బడ్జెట్ 12% పెంచడం మన దేశ భద్రతరీత్యా అవసరమే. రక్షణ ఉత్పత్తుల్లో మనం స్వావలంబన సాధించే విధంగా ప్రణాళికలు సిద్ధపరచడం ముదావహం.“ అంటూ కేంద్ర బడ్జెట్లోని సానుకూల అంశాలను పవన్ కళ్యాణ్ స్వాగతించారు.
గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఎన్నో కష్టనష్టాలు చవిచూస్తున్నామని పేర్కొన్న పవన్ కళ్యాణ్ ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ పతనం కాకుండా కాపాడిన వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వడం రైతన్నలకు భరోసా కల్పించడంగా జనసేన భావిస్తోందని తెలియజేశారు. “ఆధునిక వ్యవసాయం దిశగా వేసే అడుగుల వేగం పెరిగిందని అవగతమవుతోంది.
వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పన, ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటు, అద్దె ప్రాతిపదికన రైతులకు వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను అందించడం, వ్యవసాయ స్టార్టప్ లకు ప్రోత్సాహకాలు వంటివి వ్యవసాయ రంగానికి.. తద్వారా రైతులకు ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంది. అయితే 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని గత బడ్జెట్లో ప్రకటించిన ప్రభుత్వం ఆ హామీకి ఎంత చేరువ అయ్యారో ఈ బడ్జెట్లో ప్రస్తావించి ఉంటే బేరీజు వేసుకోడానికి వీలుండేది.“ అంటూ లోతైన విశ్లేషణ చేశారు.
ఆదాయపు పన్ను పరిమితిని ఈసారి బడ్జెట్లో పెంచుతారని ఎదురుచూసిన ఉద్యోగులు నిరాశకు గురయ్యారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక కేటాయింపులు చేసి ఉంటే బాగుండేదని జనసేన భావిస్తోందన్నారు. ప్రజలకు వ్యక్తిగత ప్రయోజనాలు ఈ బడ్జెట్లో లేనప్పటికీ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రయత్నాలు సఫలీకృతం కావాలని జనసేన కోరుకుంటోందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు కొత్తగా కల్పిచాలని ఈ బడ్జెట్లో పేర్కొనడాన్ని జనసేన స్వాగతిస్తోంది. అదేవిధంగా రాష్ట్రాలకు లక్ష కోట్ల రూపాయలతో నిధి, అదేవిధంగా 50 ఏళ్ల వరకు వడ్డీ లేకుండా లక్ష కోట్ల రూపాయల రుణాన్ని రాష్ట్రాలు తీసుకునే అవకాశం రాష్ట్రాలకు మేలు చేస్తుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఉపయుక్తంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.
ప్రజలపై కొత్తగా పన్నుల భారం వేయకుండా బడ్జెటును రూపొందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను జనసేన పార్టీ అభినందిస్తోందని పవన్ తెలిపారు.