కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతారన్న సామెతకు తగ్గట్లు ప్రధాని మోడీ కి అన్ని కలిసి వస్తున్నాయి. కీలకమైన ఎన్నికలకు కాస్త ముందుగా ఆయన షెడ్యూల్ ప్రకారం అనుకున్న అంశాలకు తోడుగా.. మరికొన్ని కాలం కలిసి వచ్చేలా చేస్తోంది. అప్పుడెప్పుడో ఇందిరమ్మ రికార్డును బ్రేక్ చేయటమే లక్ష్యంగా పెట్టుకున్న నరేంద్ర మోడీ.. ఎన్నికల్లో గెలుపు ధీమాతో ఉన్నారు. హ్యాట్రిక్ ప్రధానిగా సంచలనాన్ని క్రియేట్ చేయాలన్న తపనలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయనకు.. ఆయన ప్రభుత్వానికి మరో మైలేజీ తీసుకొచ్చే అంశం తెర మీదకు వచ్చింది.
పాకిస్థాన్ కు రావి నది నీటిని ఆపేస్తూ భారత సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇంతకాలం అనవసరంగా వెళుతున్న నీటికి అడ్డుకట్ట వేసి.. ఆ నీళ్లను పంజాబ్.. కాశ్మీర్ రాష్ట్రాలకు పంపిణీ అయ్యేలా.. పాక్ కు వెళ్లకుండా బ్రేకులు వేసే పనిని విజయవంతంగా పూర్తి చేశారు. దశాబ్దాల నుంచి రావి నది నీటిని పాక్ కు వెళ్లకుండా డ్యామ్ కట్టాలన్న కల నేటికి పూర్తైంది. దీంతో.. కీలకమైన ఎన్నికల వేళ మరో విజయం మోదీ సర్కారు ఖాతాలో చేరినట్లుగా చెప్పాలి.
ఈ అంశానికి సంబంధించిన చరిత్రలోకి వెళితే.. 1960లో సంతకం చేసిన ఇండస్ వాటర్ ట్రీట్ నుంచి మొదలు పెడితే.. ఇప్పటివరకు ఏం జరిగిందో ఇట్టే అర్థమవుతుంది.
మోడీ సాధించిన విజయం ఎంతటిదన్నది తెలుస్తుంది. ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలో ఇండస్ వాటర్ ట్రీట్ ప్రకారం రావి జలాలపై భారత్ కు ప్రత్యేక హక్కులు ఉన్నాయి. పంజాబ్ లోని పఠాన్ కోట్ జిల్లాలోని షాపూర్ కంది బ్యారేజీ.. జమ్ము కశ్మీర్.. పంజాబ్ మధ్య వివాదం కారణంగా నిలిచింది. దీంతో.. కొన్నేళ్లుగా భారత్ కు చెందిన రావి జలాలు పాక్ కు వెళ్లిపోతున్న దుస్థితి. నాటి ఒప్పందంపై నాటి జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి షేక్ మహ్మద్ అబ్దుల్లా.. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ సంతకాలు చేశారు. 1982లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
1988 నాటికి దీన్ని పూర్తి చేయాలన్నది లక్ష్యం. కానీ, అదేమీ జరగలేదు. దీంతో రావి నది నీరు పాకిస్థాన్ లోకి ప్రవహిస్తూనే ఉంది. షాపూర్ కంది ప్రాజెక్టును 2008లో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. 2013లో నిర్మాణ పనులు మొదలయ్యాయి. అయితే.. జమ్ముకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల మధ్య వివాదాల కారణంగా 2014లో ఈ ప్రాజెక్టు మళ్లీ నిలిచిపోయింది. దీంతో.. మోడీ సర్కారు ఈ ప్రాజెక్టు మీద ఫోకస్ పెట్టింది. రెండు రాష్ట్రాల మధ్య మధ్యవర్తిత్వం వహించింది. రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందంతో మళ్లీ డ్యాం పనులు మొదలయ్యాయి. తాజాగా పూర్తి అయ్యాయి. దీంతో.. ఇంతకాలం రావి నది నీళ్లు పాకిస్థాన్ కు వెళుతుండగా.. ఇప్పుడు అది కాస్తా ఆగిపోయిన పరిస్థితి.
అదే సమయంలో జమ్ముకశ్మీర్ లోని కథువా.. సాంబాలకు సాగునీరు అందుతుంది. సుమారు 1150 క్యూసెక్కుల నీరు దాదాపు 75వేల ఎకరాలకు పైనే అందనుంది. జమ్ముకశ్మీర్.. పంజాబ్ లతో పాటు రాజస్థాన్ రాష్ట్రానికి ఈ డ్యామ్ నీరు అందుతుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టల చందంగా.. మూడు రాష్ట్రాల సాగునీటికి నీరుతో పాటు.. దాయాది పాక్ కు నీళ్లు వెళ్లకుండా ఆపేసిన ఘనత మోడీ సర్కారు ఖాతాలో నమోదైంది.