టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెక్ పెట్టబోతున్నారా..? కొలికపూడి ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ ను యాక్టివ్ చేయబోతున్నారా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చాక కొలికపూడి వివాదాస్పద వైఖరి టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. అమరావతి ఉధ్యమ నేపథ్యం నుంచి కొలికపూడి తెరపైకి వచ్చారు.
అమరావతి ఉధ్యమానికి బలమైన మద్ధతుదారుడిగా నిలిచి చంద్రబాబును ఆకట్టుకున్నారు. కొలికపూడిని నమ్మిన బాబు.. 2024 ఎన్నికల్లో తిరువూరు సిట్టింగ్ స్థానాన్ని కల్పించి ప్రోత్సహించారు. ఆయన అంచనాలకు తగ్గట్లుగానే కొలికపూడి తిరువూరు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కానీ ఆ తర్వాతే అసలు రచ్చ మొదలైంది. ప్రతినిత్యం ఏదో ఒక వివాదంతో హెడ్లైన్స్ లో నిలిచారు. కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారు. ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులను బహిరంగంగా దుర్భాషలాడారు. కొలికపూడి శ్రీనివాసరావు మాకొద్దు బాబోయ్ అంటూ సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే నిరసనలు తెలిపే స్థాయిని తెచ్చుకున్నారు.
అధిష్ఠానానికి కంటిలో నలుసుగా మారిన కొలికపూడిని ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు హెచ్చరించారు. ఆయన వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచారు. అయిన కూడా ఆయన తీరు మారలేదన్న విమర్శలు పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొలికపూడికి చెక్ పెట్టి తిరువూరులో జవహర్ ను యాక్టివ్ చేయాలని బాబు ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
కొవ్వూరులో ఉపాధ్యాయుడిగా పని చేసిన జవహర్.. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి.. వైసీపీ అభ్యర్థి తనేటి వనితను ఓడించారు. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన జవహర్.. 2017లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఎక్సైజ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో తిరువూరు నుంచి టీడీపీ తరపున పోటీ చేసినప్పటికీ.. వైసీపీ అభ్యర్థి కొక్కిలిగడ్డ రక్షణ నిధి చేతిలో ఓడిపోయారు. కొన్ని అంశాల్లో వెనుకబాటు కారణంగా 2024 ఎన్నికల్లో జవహర్ కు చంద్రబాబు సీటు ఇవ్వలేదు. అప్పటి నుంచి యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటూ వచ్చాయి.
అయితే ఇప్పుడు తిరువూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కొలికపూడిపై తీవ్ర అసంతృప్తి పేరుగుతున్న నేపథ్యంలో.. ప్రత్యామ్నాయంగా చంద్రబాబు మళ్లీ జవహర్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల ఓ వివాహక వేడుకలో చంద్రబాబు జవహర్ తో పర్సనల్ గా మాట్లాడారని.. తిరువూరులో యాక్టివ్ కావాలని సూచించారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారమే నిజమైతే కొలికపూడి టీడీపీ నుంచి తప్పుకోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.