టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ అన్న రీతిలో కొద్ది రోజులుగా వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ జల్ పల్లిలోని ఇంటి నుంచి మనోజ్ వెళ్లిపోయి చాలాకాలం అయింది. ఆయనను ఇంటి నుంచి వెళ్లాలని మోహన్ బాబు చెప్పారు. అయితే, తాజాగా నేడు మరోసారి జల్ పల్లిలోని ఇంటికి మనోజ్ రావడంతో ఈ వివాదం మళ్లీ రాజుకుంది. తన నివాసంలోని వస్తువులను, కారును తన అన్న మంచు విష్ణు ఎత్తుకెళ్లాడని పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేశాడు.
తన కూతురి పుట్టినరోజు కోసం భార్యతో కలిసి రాజస్థాన్ వెళ్లానని, ఆ సమయంలో విష్ణు, ఆయన అనుచరులు తన ఇంట్లోకి వచ్చి దొంగతనానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జల్ పల్లిలోని ఇంటికి మనోజ్ వెళ్లారు. అయితే, తలుపులు తెరవకపోవడంతో మనోజ్ ఇంటి ముందే బైైఠాయించారు. దీంతో, జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇక్కడకు ఎవరినీ పోలీసులు అనుమతించడం లేదు.