పుష్ప-2 సినిమా ప్రదర్శన సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుని ఓ మహిళ మృతి చెందిన కేసులో హీరో అల్లు అర్జున్ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం.. అతను ఒక రోజు జైలులో ఉండి శనివారం ఉదయం విడుదల కావడం ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. బన్నీ అరెస్ట్ కావడం ఎంత సంచలనమో.. ఒక రోజు జైల్లో గడపడమూ అంతే చర్చనీయాంశం అయింది. ఉదయం ఇంటికొచ్చిన బన్నీకి అభిమానులు బ్రహ్మరథం పట్టగా.. కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీ అంతా అతడికి బాసటగా నిలిచింది. బన్నీ ఇంటికొచ్చేలోపే పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు, సన్నిహితులు అక్కడికి చేరుకున్నారు. ఇక ఉదయం నుంచి ఇండస్ట్రీ ప్రముఖులు పెద్ద ఎత్తున బన్నీ ఇంటికి చేరుకుని అతణ్ని పరామర్శించారు. బన్నీ ఇంటి దగ్గర ఏదో ఈవెంట్ జరుగుతున్నట్లుగా కోలాహలం మామూలుగా లేదు. సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఓవైపు తన కోసం వచ్చిన మిత్రులు, సినీ ప్రముఖులను కలుస్తూనే బన్నీ.. కాల్స్ మాట్లాడుతూ కనిపించాడు. నేరుగా వచ్చిన బన్నీని పరామర్శించలేని వాళ్లు ఫోన్ కాల్ ద్వారా అతడితో టచ్‌లోకి వచ్చారు. ఇలా బన్నీతో మాట్లాడిన వాళ్లలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నట్లు సమాచారం. బన్నీ-తారక్ బావ బావమరదుల్లా మెలుతారన్న సంగతి తెలిసిందే. ఒకరినొకరు బావ, బావ అనే సంబోధించుకుంటారు. వయసులో ఒక నెలన్నర పెద్ద వాడు కాబట్టి తారక్‌ను బావగా, బన్నీని బావమరిదిగా భావించవచ్చు.
తాను ఇంటికి రాలేని పరిస్థితుల్లో బన్నీకి కాల్ చేసి అరెస్ట్, జైలు వ్యవహారంపై అడిగి తెలుసుకున్నాడట తారక్. మరోవైపు నందమూరి బాలకృష్ణ సైతం బన్నీకి కాల్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆహా టాక్ షో అన్‌స్టాపబుల్‌లో ఒక ఎపిసోడ్ సందర్భంగా వీళ్లిద్దరూ ఎంత కలివిడిగా ఉన్నారో తెలిసిందే. తారక్, బాలయ్య లాంటి వాళ్లు వస్తే అభిమానుల హడావుడితో పరిస్థితి అదుపు తప్పుతుంది కాబట్టే వాళ్లిద్దరూ రాలేదని తెలుస్తోంది.ఇంకా పలువురు ఫిలిం సెలబ్రెటీలు బన్నీకి ఫోన్ ద్వారా పరామర్శించినట్లు సమాచారం.