ఇటీవల ఇద్దరు టాలీవుడ్ యువ కథానాయకులు స్టేజ్ మీద తమ ఆవేదనను బలంగా వినిపించారు. అందులో ఒకరు కిరణ్ అబ్బవరం అయితే.. మరొకరు రాకేష్ వర్రె. తన సినిమాలు కొన్ని ఫెయిల్ అయినంత మాత్రాన వేరే సినిమాల్లో తనను ట్రోల్ చేస్తారా అంటూ ‘క’ ప్రి రిలీజ్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం ఎంత ఆవేదన చెందాడో తెలిసిందే.
ఇక లేటెస్ట్గా ‘జితేందర్ రెడ్డి’ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్లో దాని హీరో రాకేష్.. తన సినిమా ప్రమోషన్లకు సెలబ్రెటీస్ ఎవరిని పిలిచినా రావట్లేదని బాధ పడ్డాడు. సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి. ఇండస్ట్రీ నుంచి ఇలాంటి విషయాలపై ఎవరూ స్పందించరేంటి అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో అగ్ర నిర్మాత, ఇండస్ట్రీ పెద్దల్లో ఒకరైన దిల్ రాజు ఈ యంగ్ హీరోల ఆవేదనపై మాట్లాడారు.
ఇండస్ట్రీలో ఎవరికి ఎవరూ సపోర్ట్ చేయరని.. ఎవరి టాలెంట్ మీద వాళ్లు ఎదగాల్సిందే అని దిల్ రాజు స్పష్టం చేశారు. ‘‘ఇటీవల ‘క’ ప్రి రిలీజ్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం చేసిన వ్యాఖ్యలు విన్నా. అలాగే నిన్న ఒక హీరో సెలబ్రెటీలు ఎవరూ తమ చిత్రాన్ని సపోర్ట్ చేయడానికి రావడం లేదని బాధ పడ్డాడు. ఫిలిం ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరే నిరూపించుకోవాలి. ఎవరో ఏదో అన్నారని భయపడకూడదు. టాలెంట్ ఉంటే తప్పకుండా సక్సెస్ అవుతారు.
ఇక్కడ కేవలం టాలెంట్‌కే అందరూ పెద్ద పీట వేస్తారు. కష్టపడ్డారు కాబట్టే ‘క’ ఇంత విజయం సాధించింది. ట్రోల్స్ విషయానికి వస్తే ఒకప్పుడు పల్లెటూళ్లలో ఖాళీగా ఉండేవాళ్లు ఇతరుల గురించి మాట్లాడుకునేవారు. ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు కాబట్టి ఆ విషయాలు ఊరిలోనే ఆగిపోయాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఉండడం వల్ల ప్రపంచానికి తెలుస్తోంది. దాని వల్ల ఎవరికీ ఏమీ జరగదు.
పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కిరణ్.. నీ సక్సెస్ మాట్లాడాలి. ఎప్పుడూ ఎమోషనల్ కావద్దు. నీ దగ్గర టాలెంట్ ఉంది. మన హార్డ్ వర్కే మనల్ని నిలబెడుతుంది. ఇక్కడ ఎవరూ వెనక్కి లాగరు. సపోర్ట్ చేయరు. సెలబ్రెటీలు రావట్లేదంటే ఎవరి బిజీ వాళ్లది. వాళ్లు వచ్చారా లేదా అన్నది ముఖ్యం కాదు. సినిమాను ప్రేక్షకుల్లోకి ఎలా తీసుకెళ్తారన్నది ముఖ్యం. ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతి ఒక్కరూ ఇది గ్రహించి కష్టపడి పని చేయాలి’’ అని రాజు పేర్కొన్నాడు.