సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన నేతలపై, వారి కుటుంబ సభ్యులపై వైసీపీ సోషల్ మీడియా విభాగం అసభ్యకరమైన, అశ్లీలకరమైన పోస్టులు పెడుతున్న వైనంపై చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించగా…తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు ఆ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టబోనని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. మదం, కొవ్వు ఎక్కి సోషల్ మీడియాలో అధికార పార్టీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెడితే ఊరుకోబోనని హెచ్చరించారు.
తన కుటుంబ సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్ కుటుంబపై అభ్యంతరకర పోస్టులు పెట్టారని, పవన్ ఎంతో బాధ పడ్డారని అన్నారు. తనతో ఆడుకోవాలని చూస్తే వదిలిపెట్టబోనని, కొవ్వు పట్టిన వారి కొవ్వు తగ్గిస్తానని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థ కూడా ఆలోచించుకోవాలని,క్రిమినల్స్ కన్నా అప్పర్ హ్యాండ్ పోలీసులదే ఉండాలని చంద్రబాబు అన్నారు. బాంబులకు భయపడని తాను తన భార్య గురించి అసభ్యకరంగా మాట్లాడితే కన్నీరు పెట్టానని గుర్తు చేసుకున్నారు.
రాజకీయ ముసుగులో ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తే కుదరదని, అటువంటి పోస్టులు పెట్టి ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఊరుకోబోనని విమర్శించారు. ఆడపిల్లల వ్యక్తిత్వాన్ని హననం చేయడం, అసభ్యకరంగా, అశ్లీలంగా పోస్టులు పెట్టడం భావ ప్రకటన స్వేచ్ఛ అవుతుందా అని చంద్రబాబు ప్రశ్నించారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టుల నియంత్రణకు పకడ్బందీ చట్టం తీసుకొస్తామని అన్నారు. వైసీపీ వాళ్ళకి 11 సీట్లు కాదని, ఒక్క సీటు కూడా గెలిచే అర్హత లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు.