మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ఆరంభంలో ఎంత కష్టపడ్డారో అందరికీ తెలిసిందే. హీరో పాత్రలే కాక విలన్, క్యారెక్టర్ రోల్స్‌లోనూ ఆయన నటించాడు. సోలో హీరోగా నిలదొక్కుకోవడానికి కూడా బాగానే కష్టపడ్డాడు. ఆయన పెద్ద స్టార్ కావడానికి చాలా ఏళ్లే పట్టింది. 50 సినిమాల తర్వాత కూడా స్టార్ ఇమేజ్ సంపాదించలేకపోయాడు. ఆయన్ని తిరుగులేని స్టార్‌గా నిలబెట్టిన సినిమా ‘ఖైదీ’. ఈ సినిమా అప్పట్లో రేపిన సంచలనం అంతా ఇంతా కాదు.
అప్పటికే టాప్ స్టార్లుగా వెలుగొందుతున్న హీరోలందరికీ గుబులు పెట్టించి.. వాళ్లు భయపడినట్లే అందరినీ వెనక్కి నెట్టి చిరు మెగాస్టార్ అవడానికి పునాది వేసింది ఈ చిత్రం. 1983 అక్టోబరు 28న రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘ఖైదీ’కి ఈ రోజుతో 40 ఏళ్లు పూర్తి కావడం విశేషం. ఈ సందర్భంగా చిరంజీవి ఆ సినిమా తనకెంతో ప్రత్యేకమో తెలియజేస్తూ ట్విట్టర్లో ఎమోషనల్‌గా ఒక పోస్టు కూడా పెట్టారు.
హీరోగా చిరంజీవికే కాదు.. రచయితలుగా పరుచూరి సోదరులకు, దర్శకుడిగా కోదండరామిరెడ్డికి ఈ సినిమా ఒక పెద్ద బ్రేక్. ఈ చిత్రం తర్వాత వాళ్లందరి కెరీర్లూ మారిపోయాయి. ఇండస్ట్రీలో తిరుగులేని డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు చూస్తే మామూలుగా అనిపించొచ్చు కానీ.. అప్పట్లో ఈ సినిమా కథ ఒక సంచలనం. చేయని నేరానికి జైలుకు వెళ్లి.. అక్కడి నుంచి బయటపడి తనను ఆ కేసులో ఇరికించిన విలన్ మీద పగ తీర్చుకునే కుర్రాడి కథ ఇది.
యాంగ్రీ యంగ్ మ్యాచ్ అనే మాటకు అసలైన అర్థం చెప్పేలా ఖైదీలో చిరు చేసిన సూర్యం పాత్ర.. ఆయన పెర్ఫామెన్స్ నిలిచాయి. ఇంటెన్స్ పెర్ఫామెన్స్‌తో చిరు ఈ సినిమాను నిలబెట్టిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాలోని ఫైట్లు అప్పట్లో సంచలనం రేపాయి. అలాగే రగులుతోంది మొగలిపొద పాటలో చిరు, మాధవి కలిసి వేసిన స్టెప్పులు కూడా ఉర్రూతలూగించాయి. ఆరంభం నుంచి చివరి వరకు ఇంటెన్స్‌గా సాగే ఆ సినిమా.. ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని అప్పట్లోనే ఎనిమిది కోట్ల షేర్ రాబట్టడం విశేషం. ఈ సినిమా తర్వాత చిరు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేకపోయింది.