ప్రభాస్ లాంటి టాప్ స్టార్ సరసన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ను హీరోయిన్గా ఎంపిక చేయడం పెద్ద షాకే. ఇమాన్వి ఇస్మాయిల్ అనే అమ్మాయికి ఫౌజీ (వర్కింగ్ టైటిల్) చిత్రానికి అలాగే ఛాన్స్ ఇచ్చాడు హను రాఘవపూడి. దీంతో సోషల్ మీడియా ఈ అమ్మాయి తెగ పాపులర్ అయిపోయింది. ఈ అమ్మాయిని అప్పుడు తెగ కొనియాడిన నెటిజన్లు.. ఇప్పుడు ఆమెను టార్గెట్ చేస్తున్నారు.
ఇమాన్విని ప్రభాస్ సినిమా నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమె పాకిస్థాన్ జాతీయురాలన్నది వారి ఆరోపణ. పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్థాన్ మీద, ఆ దేశస్థుల మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్న భారత నెటిజన్లు.. ఇమాన్వి మీద కూడా పడిపోయారు. దీంతో ఇమాన్వి క్లారిటీ ఇచ్చింది. తనలో భారతీయ రక్తమే ప్రవహిస్తోందని… తనకు పాకిస్థాన్‌తో సంబంధం లేదని ఆమె స్పష్టం చేసింది.
ఐతే ఇమాన్విని ఇలా నెటిజన్లు టార్గెట్ చేయడానికి కారణం లేకపోలేదు. ఆమె గతంలో చేసిన ఒక రీల్ వల్లే ఇప్పుడు వివాదం నడుస్తోంది. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుంటే.. తాను ఎవరికి సపోర్ట్ చేయాలి అనే సంకట స్థితి వచ్చిందంటూ ఇమాన్వి ఒక రీల్ చేసింది. అందులో ‘‘నా జానూ నా’’ అంటే సాగే పాట అది. అంటే ‘‘నాకు తెలియదు’’ అని అర్థం. ఈ మాటనే హ్యాష్ ట్యాగ్‌గా పెట్టి డ్యాన్స్ చేసింది ఇమాన్వి. అంతే కాక ‘‘మిక్స్డ్ బ్రీడ్’’ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఇమాన్వి జోడించింది.
దీంతో ఆమె సగం ఇండియన్, సగం పాకిస్థానీ అని.. అందుకే ఆమెను ప్రభాస్ సినిమా నుంచి తప్పించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పాక్ నటులు ముఖ్య పాత్రలు పోషించిన కొన్ని సినిమాలను బాలీవుడ్ వాళ్లు పక్కన పెడుతున్న నేపథ్యంలో ‘ఫౌజీ’ నుంచి ఇమాన్విని తప్పించకుంటే బాయ్‌కాట్ ట్రెండ్ చేస్తామని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.