ఏపీలో వాలంటీర్లకు సీఎం చంద్రబాబు బిగ్ షాక్ ఇచ్చారు. గత వైకాపా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాన్ని లబ్ధిదారులకు వాలంటీర్లే చేరవేశారు. వాలంటీర్ల సహకారంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి రావాలని ప్రణాళికలు రచించినప్పటికీ అవి ఫలించలేదు. ఎన్నికల వేళ ఈసీ వాలంటీర్లను విధుల నుంచి తొలగించింది. దాంతో లక్ష మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేసి జగన్ కు మద్దతుగా నిలిచారు. ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
కూటమి పార్టీలు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామంటూ హామీ ఇచ్చారు. అలాగే వాలంటీర్ల జీతం రూ. 10 వేలకు పెంచుతామని చెప్పారు. అయినా కూడా వాలంటీర్లు వినకుండా రాజీనామా చేశారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.
ఇదే తరుణంలో వాలంటీర్లకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో ప్రతి నెల వాలంటీర్లే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ అందించేవారు. అయితే ఇప్పుడు ఈ బాధ్యతను కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గ్రామ, అవార్డు, సచివాలయం ఉద్యోగులకు అప్పగించింది. జూలై 1వ తేదీ నుంచి ఈ మార్పు అమల్లోకి రాబోతోంది. తాజాగా జరిగిన కేబినెట్ భేటిలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ప్రతి నెలా వాలంటీర్లకు చెల్లించే 200 రూపాయల న్యూస్ పేపర్ అలవెన్స్‌ను కూడా ప్రభుత్వం రద్దు చేసింది.
దీంతో వాలంటీర్ వ్యవస్థ విషయం లో చంద్రబాబు ప్రభుత్వం యుటర్న్ తీసుకుందంటూ వైకాపా విమర్శల దాడికి దిగింది. వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తూ.. రూ.10 వేలు జీతం ఇస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వారికి మార్క్ వెన్నుపోటు పొడిచాడని.. వాలంటీర్ వ్యవస్థకి మంగళం పాడే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మొత్తానికి వాలంటీర్ల వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.