ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. అయితే, వివేకా హత్య కేసులో జగన్ సమీప బంధువు, సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేరు ముందు నుంచి బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా, తన తండ్రి హత్య కేసులో అవినాష్ రెడ్డికి పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ప్రమేయంపై వివేకా కూతురు సునీత రెడ్డి కూడా గతంలో సంచలన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది.
ఈ నేపథ్యంలోనే వివేకా మర్డర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి సిబిఐ తాజాగా మరోసారి నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. జనవరి 28న విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి ఈ నెల 24న విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు జారీ చేసింది. అయితే, ఇప్పటికిప్పుడు తాను విచారణకు హాజరు కాలేనని, ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలున్నాయని అవినాష్…. సిబిఐకి జవాబు ఇచ్చారు.
దీంతో, ఈ నెల 28న హాజరు కావాలని రెండోసారి సిబిఐ నోటీసులిచ్చింది. అయితే, ఈనెల 28న అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరవుతారా లేక వేరే ఏదైనా కారణం చెప్పి విచారణకు వెళ్లకుండా ఉంటారా అన్నది తేలాల్సి ఉంది. రెండున్నర సంవత్సరాలుగా తనపై, తన కుటుంబంపై ఒక వర్గం మీడియా అసత్య ఆరోపణలు చేస్తోందని అవినాష్ రెడ్డి ఆరోపించారు. న్యాయం గెలవాలని, నిజం వెల్లడి కావాలని అన్నారు.
తనపై ఆరోపణలు చేసేవారు ఒక్కసారి ఆలోచించుకోవాలని, ఈ తరహా ఆరోపణలు చేస్తే వారి కుటుంబాలు ఎలా ఫీల్ ఫీలవుతాయో ఊహించుకోవాలని అన్నారు. ఇక, అవినాష్ రెడ్డి అమాయకుడని, ఆయనను, ఆయన కుటుంబాన్ని సీబీఐ ద్వారా వేధిస్తున్నారని మంత్రి రోజా కూడా బాధపడిన సంగతి తెలిసిందే.