తొందరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల విషయంలో బీజేపీ అగ్రనేతలు వ్యూహాన్ని మార్చారు. మామూలుగా అయితే ఎన్నికలకు ముందే పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరనే విషయాన్ని బీజేపీ ప్రకటిస్తుంటుంది. అలాంటిది ఇపుడు దానికి రివర్సులో మొదలుపెట్టింది. ఏమిటంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే సీఎం ఎవరనేది నిర్ణయిస్తామని ప్రకటించింది. ఒక్కసారిగా తన వ్యూహాన్ని ఎందుకు మార్చుకున్నట్లు ? ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళపైనే కాకుండా పార్టీలో అంతర్గత గొడవలు పెరిగిపోయాయట.
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పైన బాగా వ్యతిరేకత పెరిగిపోతోందట. చౌహాన్నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఓటమి ఖాయమని అగ్రనేతలకు బాగా అర్ధమైపోయిందట. ఎందుకంటే ఇప్పటికే ప్రీ పోల్ సర్వేపై అనేక సంస్ధలు చేసిన సర్వేల్లో బీజేపీ ఓడిపోవటం ఖాయమని తేలింది. అందుకనే చౌహాన్ ప్రకటించలేక ఇదే సమయంలో వేరే నేతను కూడా ప్రకటించలేక బీజేపీ అగ్రనేతలు నానా అవస్తలు పడుతున్నారు. అందుకనే ముందు అధికారంలోకి వస్తే చాలు అన్నట్లుగా ఉంది అక్కడి వ్యవహారం.
ఇక రాజస్థాన్, చత్తీస్ ఘడ్, తెలంగాణ లో పరిస్ధితులు ఏమంత ఆశాజనకంగా లేవు. కారణం ఏమిటంటే పార్టీలోని నేతల మధ్య అంతర్గత విభేదాలు బాగా పెరిగిపోయాయి. ఈ విభేదాల కారణంగానే పార్టీ విజయావకాశాలు దెబ్బతినబోతున్నాయని అగ్రనేతలకు ఇప్పటికే రిపోర్టు చేరిందట. పార్టీ నేతల మధ్య ఎన్నికలకు ముందే ఇంత గొడవలు ఉన్నపుడు ఇక ముఖ్యమంత్రి అభ్యర్ధిని కూడా ప్రకటిస్తే గొడవలు, గ్రూపు రాజకీయాలు పెరిగిపోవటం ఖాయమనే భయం మొదలైందట.
అందుకనే సీనియర్లందరినీ ఏకతాటిపైకి తెచ్చి ముందు గెలుపు దక్కించుకుంటే తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించవచ్చని అగ్రనేతలు డిసైడ్ చేశారు. అగ్రనేతల ఆలోచనతోనే పార్టీలో ఏ స్ధాయిలో విభేదాలు పెరిగిపోయాయో అర్ధమవుతోంది. నేతల మధ్య విభేదాలను పరిష్కరించటం, అందరినీ ఏకతాటిపైకి తేవటం చెప్పుకున్నంత సులభంకాదు. ఈ విషయాలు నరేంద్రమోడీ, అమిత్ షా కు తెలియనివికావు. అందుకనే ముఖ్యమంత్రి అభ్యర్ధులను ఎన్నికలకు ముందు ప్రకటించటమంటే తేనెతుట్టెను కదల్చటమనే అభిప్రాయానికి వచ్చారు. అందుకనే రూటు మార్చి ఎన్నికల తర్వాతే సీఎం అభ్యర్ధని చెప్పింది. మరి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాల్సిందే.