ఈ శుక్రవారం మంచి అంచనాల మధ్య విడుదలైన భారీ బడ్జెట్ చిత్రం భారతీయుడు -2 నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ఇండియన్-2ను పెద్ద ఎత్తున రిలీజ్ చేశారు. కానీ తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా చూసి పెదవి విరిచారు. హిందీలో టాక్ మరీ దారుణంగా ఉంది. అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాను ముందు నుంచే పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.
తెలుగులో మాత్రం తొలి రోజు మంచి ఆక్యుపెన్సీలే కనిపించాయి. తమిళనాట టాక్, ఓపెనింగ్స్ పర్వాలేదు. ఐతే అన్ని చోట్లా భారతీయుడు-2 గురించి వినిపించిన ప్రధానమైన కంప్లైంట్.. నిడివి ఎక్కువ అని. సినిమా ఆసక్తికరంగా ఉంటే నిడివి ఎక్కువైనా పర్వాలేదు. కానీ చాలా వరకు సన్నివేశాలు బోరింగ్‌గా, సాగతీతగా అనిపించడంతో సినిమా మీద జనాలకు నెగెటివ్ ఫీలింగ్ వచ్చేసింది.
సినిమా సాగతీత అనే ఫీడ్ బ్యాక్ టీంకు కూడా చేరడంతో దిద్దుబాటు చర్యలకు దిగారు. భారతీయుడు-2 మూడు గంటల 4 నిమిషాల నిడివితో రిలీజ్ కాగా.. అందులోంచి 20 నిమిషాలు కోత విధిస్తున్నారట. ఇప్పుడు 2.45 గంటల నిడివితో సినిమా రన్ కాబోతోంది. శనివారం రాత్రి షోల నుంచే తక్కువ నిడివితో సినిమాను ప్రదర్శించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి పూర్తి స్థాయిలో థియేటర్లలో ఎడిటెడ్ వెర్షన్ నడుస్తుంది.
ఐతే ఈ చర్య చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంలా అనిపిస్తోంది. ఈ పనేదో ఎడిటింగ్ టైంలోనే చేసి ఉంటే.. సినిమాకు ఇంత నెగెటివ్ టాక్ వచ్చేది కాదేమో. చాలా సీన్లు ఎంతకీ ముగియట్లేదనే భావన కలిగింది. డైలాగ్స్ సుదీర్ఘంగా సాగాయి. మరి ఈ 20 నిమిషాల కోతతో సినిమాకు ఏమేర మేలు జరుగుతుందో చూడాలి.