రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ప్రవచనకారుడు చాగంటి కోటేశ్వర రావు అంటే తెలియని వారు ఉండరు. పైసా ఆశించకుండా తన ప్రవచనాలతో ఆధ్యాత్మిక సందేశం ఇవ్వడం చాగంటి ప్రత్యేకత. ఈ ప్రత్యేకతనే ఏపీ ప్రభుత్వం గుర్తించి ఇటీవల ఆయనకు స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ సలహాదారుడిగా బాధ్యతలు కట్టబెట్టింది. పాలిటిక్స్ తో ఏమాత్రం సంబంధం లేని చాగంటికి ఏకంగా కేబినెట్ హోదా కలిగిన బాధ్యతలు అప్పగించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
అయితే తన ప్రతిభా సంపత్తిని సొమ్ము చేసుకునే దిశగా కాకుండా.. విలువలకు కట్టుబడి సమాజాన్ని సరైన మార్గంలో నడిపించడానికి కృషి చేసే వ్యక్తికి పదవి ఇవ్వడంతో ప్రభుత్వంపై ప్రజలు ప్రశంసలు కురిపించారు. అలాగే ఇటీవలె ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లను కలిసిన చాగంటి కోటేశ్వర రావు.. పిల్లలకు ఉపయోగపడేలా నాలుగు మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతో తాను బాధ్యతల్ని స్వీకరిస్తున్నట్లు తెలియజేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా చాగంటికి ఏపీ సర్కార్ మరో కీలక బాధ్యత అప్పగించింది.
నేటి విద్యార్థులు రేపటి పౌరులు మరియు దేశ భవిష్యత్తు నిర్ణేతలు. అటువంటి విద్యార్థుల్లో నైతిక విలువలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే చాగంటితో ప్రత్యేకంగా పుస్తకాలను తయారు చేయించి, విద్యార్థులకు పంపిణీ చేయబోతోంది. ఈ మేరకు గురువారం అమరావతిలోని ఏపీ సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పిల్లలకు ఉపయోగపడేలా మరియు వారిలో నైతిక విలువలు పెరిగేలా పుస్తకాలు రూపొందించే బాధ్యతను చాగంటి తీసుకున్నారు. ఇక మంత్రివర్గ సమావేశంలో కేజీ నుంచి పీజీ దాకా ఇంటిగ్రేట్ చేస్తూనే విద్యార్థలకు విలువలతో కూడిన పాఠ్యప్రణాళిక తయారు చేయాలనే మరో నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు.