ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ హామీల్లో ఇది కూడా ఒకటి. కూటమి ప్రభుత్వం కొలువుతీరినప్పటి నుంచి ఈ పథకం కోసం మహిళలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా శాసనమండలిలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఫ్రీ బస్ స్కీమ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కచ్చితంగా ఉంటుంది, అయితే ఏ జిల్లా మహిళలు ఆ జిల్లాలోనే ఉచితంగా ప్రయాణించేందుకు అర్హులని మండలిలో సంధ్యారాణి పేర్కొనడంతో.. వైసీపీ నేతలు కూటమిపై ట్రోలింగ్ షురూ చేశారు.
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణం అని ఊదరగొట్టి ఓట్లు వేయించుకుని.. ఇప్పుడు కండిషన్ అప్లై, జిల్లా వరకే ఫ్రీ అనడం దారుణమంటూ వైసీపీ నాయకులు సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తొమ్మిది నెలలు దాటినా ఉచిత బస్సు ప్రయాణం కల్పించకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని.. అధికారం రాగానే మాట మార్చేస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
అయితే వైసీపీ ఆరోపణలపై తాజాగా టీడీపీ రియాక్ట్ అయింది. వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుందని.. తాము ముందు నుంచి జిల్లా పరిధిలోనే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చామని టీడీపీ చెబుతోంది. `జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చని టీడీపీ చీఫ్ చంద్రబాబు, యువనేత నారా లోకేశ్ ఎన్నికల ప్రచారంలో స్పష్టమైన హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీని అమలు చేస్తోంది. ఈ హామీతో మహిళలకు మేలు జరగడం ఓర్వలేని జగన్ ఉచిత బస్సు ప్రయాణంపై విషం కక్కుతున్నాడు` అంటూ టీడీపీ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా క్లారిటీ ఇచ్చింది. అలాగే ఎన్నికలకు ముందు చంద్రబాబు, నారా లోకేష్ ప్రచార సభల్లో ఫ్రీ బస్ స్కీమ్‌పై మాట్లాడిన వీడియో క్లిప్స్ ను కూడా ఈ పోస్ట్ కు జత చేసింది.
ఒక జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలకు ఉచిత ప్రయాణం అని టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్ ఎన్నికలకు ముందు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకుంటున్నారు. జనానికి మేలు జరిగితే ఓర్వలేని జగన్ ఉచిత బస్సు ప్రయాణంపై విషం కక్కుతున్నాడు. #YCPFakePropaganda… pic.twitter.com/dOPK2TM3v7
— Telugu Desam Party (@JaiTDP) March 7, 2025