ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అనర్హతా వేటు నుంచి తప్పించుకునేందు అసెంబ్లీలో హాజరు వేయించుకున్న జగన్ సహా ఎమ్మెల్యేలు.. మరోసారి ప్రతిపక్ష హోదా కావాలంటూ లొల్లి చేశారు. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తుండగా వైసీపీ సభ్యులు నిరసన చేపట్టారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలంటూ నినాదాలు చేశారు. పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో పట్టుమని 11 నిమిషాలు కూడా తిరక్కముందే అసెంబ్లీ నుంచి వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుండి వాకౌట్ చేశారు.
అయితే అసెంబ్లీలో వైసీపీ సభ్యుల తీరు పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పవన్ మాట్లాడుతూ.. ఆరోగ్యం బాగాపోయినా గవర్నర్ శాసనసభకు వచ్చి ప్రసంగిస్తే వైసీపీ అడ్డుకోవాలనుకోవటం చూడటం సరైన తీరు కాదని ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష హోదా అడిగితే వచ్చేది కాదు ప్రజలు ఇవ్వాలని వైసీపీకి పవన్ చురకలు అంటించారు. సభలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని.. తమ పార్టీ కంటే ఒక్క సీటు ఎక్కువొచ్చినా ప్రతిపక్ష హోదా దక్కేదన్నారు.
11 సీట్లు ఉన్న వైసీపీకి ఈ ఐదేళ్లలో ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశామే లేదని.. ఈ విషయాన్ని వైసీపీ మెంటల్ గా ఫిక్స్ అయితే మంచిదని పవన్ కళ్యాణ్ హితవు పలికారు. మన దేశ నిబంధనల ప్రకారం వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని..జర్మనీ రాజ్యాంగంలో అలాంటి అవకాశం ఉంది. కావాలి అంటే వారు అక్కడకు వెళ్లి ప్రతిపక్ష హోదా తెచ్చుకోవచ్చని పవన్ సెటైర్ వేశారు. ఇకనైనా వైసీపీ హుందాగా వ్యవహరించాలని.. సభకు వస్తే, ఆ పార్టీకి ఉన్న బలం బట్టి ఎంత సమయం కేటాయించాలో కేటాయిస్తారని పవన్ సూచన చేశారు.