ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ని పాతాళానికి అణగదొక్కి.. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న తర్వాత వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కార్పొరేటర్లు మొదలుకుని ఎంపీల వరకు ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడుతున్నారు. అధికారం లేని చోట ఉండటం కంటే, అధికార పార్టీలో చేరిపోవడం సురక్షితమని భావిస్తున్నారు.
తాజాగా ఈ జాబితాలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు కూడా చేరారు. ఈ ఎంపీలిద్దరూ ఈ రోజు వైసీపీ పార్టీకి, రాజ్యసభ ఎంపీ పదవులకు ఏకకాలంలో రాజీనామా చేశారు. అలాగే మోపిదేవి టీడీపీలో చేరబోతున్నట్లు కూడా ప్రకటించారు. అయితే ఈ వరుస వలసలపై తాజాగా మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందిస్తూ జగన్ పై సెటైర్లు పేల్చారు.
ఒకప్పుడు మేము గేట్లు ఎత్తేస్తే టీడీపీ ఖాళీ అవుతుందంటూ జగన్ సవాళ్లు విసిరారు.. కానీ ఇప్పుడు తాము గేట్లు ఎత్తామంటే వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుందని గంటా అన్నారు. గతంలో వైసీపీ మునుగుతున్న నావ అని అన్నాను.. అది ఇప్పుడు మునిగిపోయిన నావ అని ఆయన సెటైర్లు వేశారు.
వైసీపీకి చెందిన ఎందరో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు.. అయితే వారంతా తమ పదవులకు రాజీనామా చేస్తేనే టీడీపీలోకి ఆహ్వానం ఉంటుందని చంద్రబాబు నాయుడు కండీషన్ పెట్టారని గంటా ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి వచ్చిన వారిని మాత్రమే తమ పార్టీలోకి తీసుకుంటామన్నారు. ఇక వైసీపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్ప ఎవరూ మిగలరని గంటా ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకోవడానికైనా జగన్ తన వ్యక్తిత్వాన్ని, తీరును మార్చుకోవాలని గంట హితవు పలికారు.