ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాల ద్వారా గత ఐదేళ్ల వైకాపా పాలనలో అన్ని శాఖల్లో చోటు చేసుకున్న భయంకరమైన పరిస్థితులను మరియు వాస్తవాలను ప్రజలందరికీ తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యుత్ రంగంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. అప్పట్లో మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాన్ని గత వైసీపీ ప్రభుత్వం ఏ స్థాయికి దిగజార్చింది..? మళ్లీ విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టడానికి తమ ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏంటి..? అనే విషయాలను ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు.
ఐదేళ్లలో గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని సర్వ నాశనం చేసిందని మండిపడిన చంద్రబాబు.. అసమర్థులు పాలన చేస్తే ఏమవుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. తమ హయాంలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశామని.. 2014-19లో సౌరశక్తి, పవన విద్యుత్ ఉత్పత్తి పెంచామని, విద్యుత్ ఛార్జీలు పెంచకుండా చర్యలు తీసుకున్నామని చంద్రబాబు వివరించారు. 2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీ ఎదిగిందని గుర్తుచేశారు.
2018-19 నాటికి 14,929 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చేరేలా కృషి చేశామని చంద్రబాబు తెలియజేశారు. కానీ గత ఐదేళ్లలో ప్రజలపై వైసీపీ ప్రభుత్వం రూ. 32,166 కోట్ల ఛార్జీల భారం మోపిందని.. విద్యుత్ రంగంలో రూ. 49, 596 కోట్లు అప్పులు చేసి పెట్టిందని చంద్రబాబు విమర్శించారు. అంతేకాకుండా గృహ వినియోగదారులపై 40 శాతం ఛార్జీలు పెంచారు, 50 యూనిట్లు వాడిన పేదలపై 100 శాతం ఛార్జీలు పెంచారు, టారిఫ్ ద్వారా రూ. 16,699 కోట్లు.. ట్రూ అఫ్ ద్వారా రూ. 5,607 కోట్లు వసూలు చేశారని సీఎం తెలియజేశారు.
ఛార్జీల పేరుతో ప్రజలను మోసం చేయడంతో పాటు వేల కోట్ల రుణం తీసుకుని విద్యుత్ రంగాపై గత ప్రభుత్వం పెనుభారం మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ విద్యుత్ లో చేసుకున్న 21 ఒప్పందాలను రద్దు చేశారని.. అహంకార పాలన వల్ల విద్యుత్ రంగం రూ. 47,741 కోట్లు నష్టపోయేలా చేశారని వివరించారు. విద్యుత్ సంస్థలకు రూ.1 లక్షా 29 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని చంద్రబాబు వెల్లడించారు. ఇక గత ప్రభుత్వంలో గాడి తప్పిన విద్యుత్ రంగాన్ని వీలైనంత త్వరగా గాడిలో పెడతామని ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు హమీ ఇచ్చారు. వ్యవసాయ పంప్ సెట్లకు స్మార్ట్ మీటర్ల పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని.. రోప్ టాప్ సౌర శక్తి ఉత్పత్తి పెంచేందుకు చర్యలు చేపడతామని చంద్రబాబు తెలియజేశారు.