విశాఖలో పవన్ పర్యటన.. దాని పర్యవసానాలు.. ఇప్పుడు ఆసక్తిగా మారాయి. వాస్తవానికి జనసేన అధినేత పవన్ను వైసీపీ నాయకులు.. “రెండు చోట్ల ఓడిపోయావు.. నీకు మాట్లాడే అర్హత ఏదీ?“ అంటూ.. విమర్శలు గుప్పిస్తున్నారు. ఔను.. నిజమే.. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్.. రెండు చోట్ల పోటీ చేశారు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, ఉమ్మడి విశాఖ జిల్లా గాజువాకల్లో అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన ఆయన పరాజయం పాలయ్యారు.
అంతేకాదు.. ఒక్కరు మాత్రమే ఆ పార్టీ తరఫున విజయం దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు తరచుగా ఇదే విషయాన్ని విమర్శిస్తుంటారు. మరి తాజా పరిణామాలను గమనిస్తే.. రెండు చోట్ల ఓడిపోయిన నాయకుడుగా.. పవన్ జనవాణి కార్యక్రమం పెట్టేందుకు వస్తే.. ఎందుకు క్యాన్సిల్ చేయించారనేది జనసేన నేతల ప్రశ్న.
ఇదే విషయాన్ని పవన్ కూడా ప్రశ్నించారనుకోండి. వాస్తవానికి ఒక్క స్థానంలో ఓడిపోతేనే.. ఎవరూ పట్టించుకోరు. ఇక, రెండు చోట్ల ఓడిపోతే..ఇంకెవరు మాత్రం పట్టించుకుంటారు? అయినా.. కూడా.. వైసీపీ నాయకులు మాత్రం.. పవన్ను పట్టించుకుంటున్నారు. ఆయన కార్యక్రమాలపై విమర్శలు చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఆయనను దుయ్యబడుతున్నారు. మరి ఇవన్నీ.. ఎందుకు? ఆయన మానాన ఆయనను వదిలేయొచ్చుకదా!
కానీ, ఇక్కడే అసలు సీక్రెట్ ఉంది. వచ్చే ఎన్నికల్లో సుమారు లక్షకు పైగా యువత ఓటు హక్కు పొందుతున్నారు. అదేసమయంలో ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యక్రమాలను పవన్ ఏదో ఒక రూపంలో ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్నినిలదీస్తున్నారు
అదేసమయంలో మేధావులను సైతం ఆలోచింపజేస్తున్నారు. అంతేకాదు.. రహదారులపై గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని గతంలో చేపట్టి.. ప్రభుత్వంపై ప్రజలతోనే విమర్శలు చేయించారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు.
ఇప్పుడు విశాఖలోనూ.. మూడు రాజధానులపై ఆయన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని గ్రహించిన వైసీపీ నాయకులు.. దీనివల్ల..త మ మూడు రాజధానుల వ్యూహం ముందుకు పారదనే ఆలోచనతోనే ఆయనకు, ఆయన కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. లేకపోతే.. రెండు సార్లు ఓడిపోయిన నాయకుడి గురించి 151 మంది ఉన్న వైసీపీ ఎందుకు.. ఇంతగా బెంబేలెత్తుతుందనేది ప్రశ్న.