2019 ఎన్నికల పోలింగ్ తేదీకి కొద్ది రోజుల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నాటి ప్రతిపక్ష నేత, నేటి ఏపీ సీఎం జగన్ చిన్నాన్న అయిన వివేకా వంటి హై ప్రొఫైల్ వ్యక్తి హత్య జరిగి రెండేళ్లు పూర్తయినా…అసలు దోషులెవరన్నది ఇంకా తేలకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఈ కేసు విచారణ నత్తనడకన సాగడంపై వివేకా కుమార్తె డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి గతంలో పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో ఈ కేసు పురోగతి పై ఎంక్వయిరీ చేసిన సునీత…ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి ఈ కేసులో తమ కుటుంబ సభ్యుల్లో కొందరిపై అనుమానాలున్నాయని వెల్లడించడం కలకలం రేపింది. వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి సహా పలువురి పేర్లను హైకోర్టులో వేసిన పిటిషన్లో సునీత పేర్కొనడం పెను దుమారం రేపింది. అయితే, తాజాగా సీబీఐ విచారణ వేగవంతం అయినప్పటికీ…అసలు దోషులు తెర మీదకు రావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
సునీత పిటిషన్ లో పేర్కొన్న పేర్లలోని పెద్దలను ఇంకా విచారణ చేయలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సీబీఐ అధికారులతో సునీత భేటీ అయ్యారు. కడప సెంట్రల్ జైలు అతిథి గృహంలో సీబీఐ అధికారులను వైఎస్ సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి కలిశారు. గంట పాటు అధికారులతో దంపతులిద్దరూ మాట్లాడారు. ఈ కేసుకు సంబంధించిన పురోగతిపై వారిద్దరూ ఆరా తీసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు, తాను పిటిషన్ లో పేర్కొన్న పేర్ల విచారణ పై కూడా సునీత అడిగినట్లు తెలుస్తోంది.
కాగా, వివేకానందరెడ్డి సింహంలాంటి వ్యక్తిఅని, సింహాన్ని సింహమే చంపుతుందని ఈ కేసులో ప్రధాన అనుమానితుడు సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ అన్నారు. సింహాన్ని తమలాంటి చిట్టెలుకలు చంపలేవని, వివేకాను చంపిందెవరో అందరికీ తెలుసని కిరణ్ మీడియా ముందు షాకింగ్ కామెంట్లు చేశారు. తాము అమాయకులమని, వివేకాను హత్య చేసేంతటి వాళ్లం కాదని వాపోయారు. ఈ కేసులో తమ కుటుంబ సభ్యులను ఇరికిస్తారేమోనని భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.