2018 విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనుపెల్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి కోడి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ దాడితో జగన్ ఎడమ భూజానికి గాయమైంది. అప్పట్లో ఈ ఇష్యూ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఆ తరువాత విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్లో జనుపల్లి శ్రీనివాసరావుపై కేసు నమోదైంది. సంఘటన స్థలంలోనే శ్రీనివాసరావు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పటి నుంచి కోడికత్తి కేసుపై కోర్టులో విచారణ సాగుతూనే ఉంది.
విశాఖ ఎన్ఐఏ కోర్టులో నేడు మరోసారి కోడికత్తి కేసు విచారణకు వచ్చింది. ప్రధాన నిందితుడుగా ఉన్న జనుపల్లి శ్రీనివాస్, అతని తరఫు న్యాయవాది సలీం మరియు దళిత సంఘాల నేతలు కోర్టు హాజరయ్యారు. కానీ కేసులో సాక్షిగా వాగ్మూలం ఇవ్వాల్సిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం కోర్టుకు రాలేదు. గత ఐదేళ్లు సీఎం హోదాలో ఉండటం వల్ల బిజీ షెడ్యూల్ అనే వంకతో జగన్ కోర్టు విచారణకు హాజరు కాకుండా డుమ్మా కొట్టారు. కానీ ప్రస్తుతం ఆయనకు సీఎం కుర్చీ లేదు. పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే జగన్ ఉన్నారు.
అయినప్పటికీ కోర్టు హాజరు కాకపోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నారు. ఇదే విషయాన్ని న్యాయవాది సలీం న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లగా.. వాదోపవాదనలు విన్న కోర్టు నవంబర్ 15కి విచారణను వాయిదా వేసింది. అనంతరం న్యాయవాది సలీం, దళిత సంఘాల నేత బూసి వెంకటరావు మీడియాతో మాట్లాడుతూ.. జగన్ తీరుపై మండిపడ్డారు.
మంత్రిగా ఉన్న నారా లోకేశ్ నేడు పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరయ్యారు.. కానీ సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న జగన్ కు మాత్రం టైమ్ దొరక్కట్లేదా? అని ప్రశ్నించారు. విచారణకు హాజరు కాకుండా, వాంగ్మూలం ఇవ్వకుండా కోర్టులను జగన్ అపహస్యం చేస్తున్నారని సలీం నిప్పులు చెరిగారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా జగన్ తీరును ప్రజలు తప్పుబడుతున్నారు.