రుషికొండ ..ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా మార్మోగిపోతున్న పేరు. దాదాపు 600 కోట్ల రూపాయల వ్యయంతో వేల కోట్ల రూపాయల విలువైన భూమిలో పర్యావరణహితంకాని రీతిలో రుషికొండపై సీఎం జగన్ కోసం నిర్మించిన భవనాల సముదాయం ఇపుడు జాతీయ మీడియాలో సైతం హాట్ టాపిక్ గా మారింది. 26 లక్షల రూపాయల బాత్ టబ్ మొదలు…ఖరీదైన స్పా వరకు…ప్రజాధనంతో ఇంద్ర భవనాన్ని తలపించేలా నిర్మించిన ఆ కట్టడాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతన్నాయి.
అయితే, రుషికొండకు బోడి గుండు కొట్టి తాము చేసిన ఘన కార్యం గురించి జనానికి తెలిసిపోవడంతో వైసీపీ నేతలు తమ తప్పు కప్పిపుచ్చుకునేందుకు కవర్ డ్రైవ్ లు ఆడడం మొదలుబెట్టారు. ఆ భవనాలు ప్రధాని మోడీ, త్రివిధ దళాధిపతి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి వీవీఐపీలు విశాఖలకు వచ్చినపుడు విడిదిగా పనికి వచ్చేలా నిర్మించామని, అంతేగానీ తమ జగనన్న కోసం నిర్మించలేదని చెబుతున్నారు. కానీ, వైసీపీ నేతలు ఎప్పటిలాగే రుషికొండ విషయంలో చేస్తున్న కవర్ డ్రైవ్ లలో పసలేకపోవడం టీడీపీ ఫీల్డర్ల చేతికి, మీడియా చేతికి దొరికిపోయి ఔటయ్యారు.
వైసీపీ నేతలు చెబుతోంది నిజమే. నిజంగా విశాఖలో పర్యావరణ అనుమతులు లేకపోయినా, పలు నిబంధనలు తుంగలో తొక్కినా సరే జగన్ కోసం అద్బుతమైన భవనాలే నిర్మించారు. కానీ, ప్రజా ధనంతో కట్టిన ఆ భవనాలు ఎవరి కోసం ఎందు కోసం అన్నది ప్రశ్న. రాష్ట్రంలో సచివాలయాలు, వైజాగ్ కలెక్టరేట్ తాకట్టు పెట్టి, మద్యంపై రాబోయే 25 ఏళ్ల ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి రోజువారీ ఖర్చులు చూసుకుంటున్న ఈ ప్రభుత్వం…60 ఎకరాల్లో 600 కోట్లు పెట్టి ఈ భవనాలు కట్టాల్సిన అవసంర ఏంటన్నది ప్రశ్న.
త్రివిధ దళాధిపతి విశాఖకు వస్తే నేవీ బేస్ లో బస చేస్తారు…ప్రధాని విశాఖ కు వస్తే ఐఎన్ఎస్ డేగాలో విడిదికి వెళతారు…ఫైవ్ స్టార్ హోటల్ కు కూడా వెళ్లరు. ఎందుకంటే ప్రొటోకాల్ అనేది ఒకటి ఉంది కాబట్టి. కానీ, జగన్ కాల్ ముందు ప్రొటోకాల్ ఎంత అనుకున్న వైసీపీ నేతలు ఆ ప్రొటోకాల్ మరిచిపోయి ఆ బిల్డింగులు జగన్ కోసం కాదు వారి కోసం అని చెప్పి అడ్డంగా దొరికి పోవడంతో వారిపై ట్రోలింగ్ జరుగుతోంది.