మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య ఏర్పడిన విభేదాలను వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకోవాలని గట్టి ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన బ్లాక్ బస్టర్ పుష్ప 2 చిత్రాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు చేసిన హంగామా నెక్స్ట్ లెవల్. ఏదో స్నేహితుడనే కారణంతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రరెడ్డి కోసం బన్నీ ఒక అడుగు ముందుకేస్తే.. ఇదే ఛాన్స్ అనుకున్న వైసీపీ పది అడుగులు ముందుకేసింది. జనసైనికులు, మెగా అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో.. బన్నీకి మేమున్నామంటూ వైసీపీ నేతలు ఓవరాక్షన్ షురూ చేశారు.
పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసేందుకు బన్నీ మావాడంటూ ప్రచారం చేయడమే కాకుండా పుష్ప 2 చిత్రానికి కూడా రాజకీయ రంగులు పలిమే ప్రయత్నాలు చేశారు. పుష్ప 2 సినిమాను అడ్డుకుంటారా? ఐకాన్ స్టార్ అంటే ఏమనుకుంటున్నారు?అరచేతిని అడ్డుపెట్టి ఈ సినిమాను ఆపే సత్తా ఎవరికీ లేదు. మేమున్నాం అంటూ వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తెగ రెచ్చిపోయారు. అంతేనా.. అల్లు అర్జున్తో పాటు వైఎస్ జగన్ ఉన్న భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి `మా కోసం నువ్వు వచ్చావు. మీ కోసం మేమొస్తాం. తగ్గేదేలే` అంటూ వైసీపీ నేతలు నినాదాలు చేశారు.
సీన్ కట్ చేస్తే.. వారందరికీ బన్నీ తాజాగా బిగ్ షాక్ ఇచ్చాడు. పుష్ప 2 సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ కు బన్నీ థ్యాంక్స్ చెప్పాడు. ఏపీలో పుష్ప 2 మూవీ టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతిస్తూ జీవో జారీ చేసినందుకుగానూ ఏపీ సీఎం చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ అని చెప్పిన అల్లు అర్జున్.. ఆ తర్వాత వ్యక్తిగతంగా కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్యూ.. మీరు చూపించిన ఈ ప్రేమకు రుణపడి ఉంటాను అని కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలు వైసీపీ నేతలకు ఏమాత్రం మింగుడు పడటం లేదు. నిన్న మొన్నటి వరకు బన్నీ కోసం వైసీపీ నేతలు పడ్డ ఆరాటం ఒక్క దెబ్బతో బూడిదలో పోసిన పన్నీరైంది. ఫైర్ అనుకుంటే బన్నీ తీరుతో వైసీపీ నేతలకు చివరకు ఫ్లవర్స్ అయిపోయారు.