వైసీపీ హయాంలో అక్రమాలకు, అడ్డగోలు దోపిడీలకు పాల్పడిన నాయకుల బాగోతాలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా బయటకు లాగుతుంటే.. ఫ్యాన్ పార్టీకి చెందిన కొందరు నేతలు మాత్రం కావాలనే తప్పుడు కేసులు పెడుతున్నారని హంగామా చేస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరికాదంటూ రెచ్చిపోయారు. పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
అసలేం జరిగిందంటే.. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కోళ్లదిన్నెలో అధికార టీడీవీ, విపక్ష వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన వారు గాయపడగా.. వారిని కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే వైసీపీ వర్గీయులు కత్తులు పట్టుకుని ఆసుపత్రి వద్ద కూడా వచ్చి రచ్చ చేయడంతో మరోసారి గొడవ జరిగింది.
అయితే ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న వైసీపీ వర్గీయులను మాజీ మంత్రి కాకాణి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులపై చింతులు తొక్కారు. టీడీపీ కార్యకర్తలు దాడులు వైసీపీ వాళ్లపై దాడులు చేస్తుంటే.. పోలీసులు వారికి సహకరిస్తున్నారని కాకాణి విమర్శించారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని… అప్పుడు ఈ పోలీసులు సప్త సముద్రాల అవతల ఉన్నా లాక్కొచ్చి బట్టలూడదీసి నిలబెడతామంటూ దురుసుగా వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం కాకాణి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.