టాలీవుడ్ నుంచి రాబోతున్న నెక్స్ట్ బిగ్ రిలీజ్ అంటే.. కన్నప్ప అనే చెప్పాలి. వేసవికి షెడ్యూల్ అయిన వేరే పెద్ద సినిమాల్లో ఒక్కొక్కటిగా రేసు నుంచి తప్పుకుంటున్నాయి. రాజా సాబ్ సమ్మర్లో రావడం సందేహమే. హరిహర వీరమల్లు చుట్టూ కూడా అనుమానాలు ముసురుకున్నాయి. ‘విశ్వంభర’ విషయంలోనూ స్పష్టత కొరవడింది. కానీ ‘కన్నప్ప’ మాత్రం ఏప్రిల్లో కచ్చితంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చెప్పినట్లే ఏప్రిల్ 10న ఈ సినిమాను రిలీజ్ చేస్తామని విష్ణు అండ్ టీం చెబుతోంది.
విష్ణు లీడ్ రోల్ చేసిన ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్లు ప్రత్యేక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఐతే గత ఏడాది రిలీజ్ చేసిన టీజర్ విషయంలో కొంత మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కానీ సినిమా విషయంలో సందేహాలేమీ పెట్టుకోవాల్సిన పని లేదని అంటున్నాడు రైటర్ బీవీఎస్ రవి.
తాను ఆల్రెడీ ‘కన్నప్ప’ ఫస్టాఫ్ చూశానని.. సినిమా అదిరిపోతుందని రవి ఒక ఇంటర్వ్యూలో ధీమాగా చెప్పాడు. ‘‘మోహన్ బాబు గారు తన కొడుకు విష్ణును పెట్టి భక్త కన్నప్ప సినిమా తీశారు. అది చాలా పెద్ద బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.
ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్.. ఇల ా చాలా పెద్ద కాస్టింగ్ ఉంది ఆ సినిమా. ‘కన్నప్ప’ మామూలుగా ఉండదు. నేను ఆల్రెడీ ఫస్టాఫ్ చూశాను. అదిరిపోయింది. మొత్తం సినిమా మామూలుగా ఉండదు. ఆన్ రికార్డ్ చెబుతున్నా ఈ మాట. తర్వాత కూడా ఇది అందరూ చూస్తారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్టవుతుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు’’ అని బీవీఎస్ రవి చెప్పాడు.
‘కన్నప్ప’ సినిమాకు విష్ణుకు డ్రీమ్ ప్రాజెక్ట్. దీని గురించి పుష్కర కాలం నుంచి మాట్లాడుతున్నాడు. ఎట్టకేలకు గత ఏడాది ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లింది. వంద కోట్లకు పైగా బడ్జెట్లో ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించారు.