వినాయకుడు దేవుల్లోనే అత్యంత ప్రాచుర్యం పొందిన దేవుడు. దీనికి కారణం… హిందువులు ఏ పూజ చేసినా ముందు గణపతి పూజ తర్వాతనే ఇతర పూజలు చేస్తారు. అందుకే ఎలాంటి సంప్రదాయం పాటించేవారైనా శ్రీ మహా గణపతిని తప్పకుండా ఆరాధిస్తారు.
వినాయకునకు సిద్ధి, బుద్ధి అనేవారు భార్యలు. అందుకే వినాయకుడు ఉన్నచోట సకల కార్యాలూ సిద్ధిస్తాయి. జ్ఙానం వికసిస్తుంది. అందువలన ఏ పనైనా – పూజ కాని, పెళ్ళి కాని, గృహప్రవేశం గాని, ప్రారంభోత్సవం గాని, రచనారంభం గాని, పరీక్ష గాని, ఉద్యోగం గాని – వినాయకుని పూజతోనే మొదలవుతుంది. ముఖ్యంగా జ్యోతిష్యులకూ, రచయితలకూ వినాయకుడు నిత్యారాధ్య దేవుడు.
మహాభారతం ప్రతి అక్షరమూ గణపతి విరచితమే
వ్యాసమహాభారతం చెప్పింది వ్యాసుడే అయినా రాసింది గణపతి. వేద వ్యాసుడు పంచమవేదమైన మహాభారతంను రాయడానికి పూనుకున్నారు. తాను చెప్తూ ఉంటే వ్రాయగల సమర్ధునికోసం గణపతిని ప్రార్థించాడు. గణపతి ఒక నియమాన్ని విధించాడు – వ్యాసుడు ఎక్కడా ఆపకుండా చెప్పాలి. అలా చెబితే తానే రాస్తాను అన్నారు. ఒప్పుకొన్న వ్యాసుడు కూడా ఒక నియమం విధించాడు – తాను చెప్పినదానిని పూర్తిగా అర్ధం చేసుకొన్న తర్వాతే గణపతి రాయాలి అన్నాడు. అలా ఒప్పందం ప్రకారం భారత కథా రచన సాగింది. మధ్యలో కలం విరిగిపోతే తన దంతాన్నే ఘంటంగా గణపతి వినియోగించాడు. అంతటి మహానుభావుల సమర్పణ గనుకనే మహాభారతం అనన్య మహాకావ్యమైనది.
ప్రతిరోజు ఈ మంత్రం చదివితే విజయమే
ప్రతిరోజు ఉదయం గణపతి మంత్రం 11 సార్లు లేదా 21 సార్లు స్మరించి రోజు మొదలుపెడితే జీవితం ఫలవంతం అవుతుంది. ఆ ఆది పూజ గ్రహీతుడు సర్వ విఘ్నాలను పోగొడతారు. ఆ మంత్రం ‘‘ఓం గం గణపతయే నమ:‘‘
ఏడాదికి రెండు సార్లు గణపతి పండుగలు వస్తాయి.
- బాధ్రపద శుద్ధ చతుర్ధి నాడు (ఆగస్టు / సెప్టెంబరు నెలలలో) వచ్చే వినాయకచవితి
- మాఘ కృష్ణ చతుర్ధి నాడు (జనవరి / ఫిబ్రవరి నెలలలో) వచ్చే వినాయక జయంతి.