మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీ మహాయుతి కూటమి 200కు పైగా స్థానాల్లో లీడ్ లో కొనసాగుతూ భారీ విజయం వైపు దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరు అన్న చర్చకు తెరలేచింది. ఈ క్రమంలోనే సీఎం పదవి ఎవరికి దక్కుతుంది అన్న విషయంపై మహారాష్ట్ర సిట్టింగ్ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. సీట్లు ఎక్కువ వచ్చిన పార్టీ అభ్యర్తే సీఎం కావాలని లేదని షిండే చేసిన కామెంట్లు కూటమిలో కాక రేపుతున్నాయి. సీట్లకు, సీఎం పదవికీ సంబంధం లేదని..ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడిన తర్వాత మిగతా పార్టీలతో కలిసి సీఎం పదవిపై చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు.
125కు పైగా స్థానాల్లో బీజేపీ లీడ్ లో ఉన్న నేపథ్యంలో మహారాష్ట్రకు కాబోయే సీఎం ఫడ్నవీస్ అని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే, శివసేన ఈ విజయంలో కింగ్ మేకర్ అని, మళ్లీ సీఎం షిండేనే అంటూ శివసేన నేతలు అంటున్నారు. షిండే లేకుంటే బీజేపీకి గెలుపు లేదని, కూటమి ఏర్పాటులో షిండేదే కీ రోల్ అని షిడే వర్గం తేల్చి చెబుతోంది. షిండే సీఎం అనే నినాదంతోనే ఎన్నికలను ఎదుర్కొన్నామని కూటమిలోని శివసేన (షిండే) అధికార ప్రతినిధి సంజయ్ షిర్సత్ చెప్పారు.
షిండేను చూసే మహాయుతి కూటమికి ప్రజలు ఓట్లేశారని అన్నారు. ఫడ్నవీస్ సీఎం అవుతారని బీజేపీ నేత ప్రవీణ్ దారేకర్ ధీమాగా ఉన్నారు. ఇక, ఎన్సీపీ చీఫ్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సీఎం అభ్యర్థి అని ఆ పార్టీ నేత అమోల్ మిట్కారీ అంటున్నారు. అజిత్ పవార్ నెక్ట్స్ మహారాష్ట్ర సీఎం అంటూ పోస్టర్లు కూడా వెలిశాయి. దీంతో, మహారాష్ట్ర సీఎం పీఠం ముడి వీడడంపై ఉత్కంఠ ఏర్పడింది.