కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి సంచలన నిర్ణయం తీసుకుంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ను ఎన్డీఏ ఎంపిక చేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు.
అంతకుముందు, ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సమావేశానికి హాజరయ్యారు. అన్ని అంశాలను బేరీజు వేసుకొని ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేశారు.
ప్రస్తుత ఉపరాష్ట్రపతి, తెలుగు తేజం వెంకయ్యనాయుడు రిటైర్మెంట్ ఖరారైంది. రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిత్వం ఆయన నుంచి జారిపోయిన దరిమిలా.. ఉపరాష్ట్రపతి గా అయినా.. ఆయనను కొనసాగిస్తారని అందరూ భావించారు. అయితే.. ఇప్పుడు అదే మోడీ.. వెంకయ్యను పక్కన పెట్టేశారని.. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా కూడా ఆయనను ప్రకటించకపోవడంతో ఆయన రిటైర్మెంట్ తప్పదని అంటున్నారు.
రాజ్యాంగ బద్ధ పదవిలో కనీసం మరో పదేళ్ల పాటు ఆయన యాక్టివ్గా ఉండాలని భావిస్తున్నట్టు.. కొన్నాళ్ల కిందట ఓ విదేశీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకయ్య పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు ఆయనకు ఆ ఛాన్స్ లేకుండా పోయిందనే వాదన వినిపిస్తోంది.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవి కూడా టికెట్లు ఖరారైన నేపథ్యంలో వెంకయ్య ఇక, ఇంటికే పరిమితం కానున్నారు. ఇప్పటి వరకు ఈ రెండు పోస్టుల్లో పనిచేసిన వారు.. రాజకీయంగా ఎక్కడా ప్రయత్నాలు చేయలేదని.. కాబట్టి వెంకయ్య ఇక, రిటైర్మెంట్కు రెడీ కావాల్సిందేనని చెబుతున్నారు.
దీనిని బట్టి.. వాజ్పేయి హయాం నుంచి బీజేపీని బలంగా ముందుకు తీసుకువెళ్లిన నాయకుడిగా ఉన్న వెంకయ్య ఇక, ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా.. వెంకయ్య పరిస్థితి ఇక, ఇక్కడితో సమాప్తమనే వ్యాఖ్యలు వినిపిస్తుండడం గమనార్హం.