ఇరు తెలుగు రాష్ట్రాల్లోని సమకాలీన రాజకీయ నాయకుల్లో మాజీ ఎంపీ, సీనియర్ పొలిటిషియన్ ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఉన్న ప్రత్యేకత వేరు. సుత్తి లేకుండా …ముక్కు సూటిగా …చెప్పదలుచుకున్న విషయాన్ని కన్విన్సింగ్ గా చెప్పగలిగిన నేర్పు ఉన్న నేత ఉండవల్లి. అంతటి వాగ్ధాటి…విషయ పరిజ్ఞానం ఉన్న ఉండవల్లిని పార్టీలకతీతంగా గౌరవిస్తారన్న టాక్ రాజకీయ వర్గాల్లో ఉంది.
అయితే, అధికార పక్షం, విపక్షం అన్న తేడా లేకుండా విమర్శలు గుప్పించడంలో ముందుండే ఉండవల్లిపై దాదాపుగా చాలా మందికి ఓ సాఫ్ట్ కార్నర్ ఉంది. గతంలో జగన్ పై సందర్భానుసారంగా పదునైన విమర్శలు చేసిన ఉండవల్లి తాజాగా జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో జగన్ పోరాడాలన్న ఉండవల్లి…అవసరమైతే జైలుకు వెళ్లి అక్కడి నుంచి పాలించాలని షాకింగ్ కామెంట్లు చేశారు.
కేంద్రాన్ని ధిక్కరించిన కారణంతోపాటు కేసుల నేపథ్యంలో ఒకవేళ జగన్ ను అరెస్టు చేసి జైల్ లో పెడితే అక్కడ నుంచే జగన్ పరిపాలించాలని, జగన్ కు జైలు కొత్తేమీ కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా జగన్ ను అరెస్ట్ చేసేంత ధైర్యం కేంద్రం చేయదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. విశాఖ ఆర్కే బీచ్ లో కార్మిక కవాతుకు సంఘీభావం ప్రకటించిన ఉండవల్లి అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం అమ్మేస్తాం లేదా మూసేస్తాం అంటోందని, అదాని, అంబానికి ప్రభుత్వ రంగ సంస్థలు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఉండవల్లి ఆరోపించారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పార్లమెంటులో చర్చ పెట్టాలని, టీడీపీ, వైసీపీ ఎంపీలు ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని అన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే హక్కు కేంద్రానికి లేదని ఉండవల్లి అన్నారు.
ప్రైవేటీకరణ చేయడమే బీజేపీ ఫిలాసఫీ అని, స్టీల్ ప్లాంట్ అమ్మడమే తప్పని, అయితే, అమ్మితే తమకే అమ్మండని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం ఇంకో తప్పని అన్నారు. ఏపీని కాదని పాండిచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పడం సరికాదని, కేంద్రానికి జగన్ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు.