రాజకీయాల్లో తల్లి..తండ్రి..అన్న…తమ్ముుడు…అక్కా…చెల్లి…ఇలా బంధాలు, బాంధవ్యాలకు పెద్ద ప్రాధాన్యత ఉండదన్న సంగతి తెలిసిందే. కుటుంబంలోని సభ్యులు వేర్వేరు పార్టీల్లో ఉంటూ కీలక పదవులు చేపట్టిన దాఖలాలు అనేకం ఉన్నాయి. ఇదే కోవలోకి టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ వస్తారు. డీస్ చిన్న కొడుకు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా బీజేపీలో కొనసాగుతుండగా…తాజాగా ఆయన పెద్ద కొడుకు సంజయ్….టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఒకే ఇంట్లో మూడు పార్టీలు అన్న విషయంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు డీఎస్ సంచలన సమాధానమిచ్చారు. తాను ఏ పార్టీలో ఉన్నానో తనకు తెలియడం లేదని, తాను టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీనేనా? అన్న విషయాన్ని సీఎం కేసీఆర్‌నే అడగాని షాకింగ్ కామెంట్లు చేశారు. టీఆర్ఎస్ నుంచి తనకు ఆహ్వానాలు రావడం లేదని వాపోయారు. తమ ఇంట్లో మూడు పార్టీలంటూ తమ కుటుంబంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజకీయాల్లో ఇది సహజమని, చాలామంది ఎంపీల ఇళ్లల్లో భార్య ఒక పార్టీలో, భర్త ఇంకో పార్టీలో ఉన్నారని గుర్తు చేశారు.
పీసీసీ చీఫ్‌గా తాను ఇంట్లో కూర్చునే చక్రం తిప్పానని అన్నారు. అరవింద్ బీజేపీలోకి వెళ్లినప్పుడు వ్యతిరేకించలేదని, కష్టపడి గెలిచి ఎంపీ అయ్యాడని అన్నారు. అలాగే సంజయ్ కూడా తనకు నచ్చిన పార్టీలోకి వెళ్లే స్వేచ్ఛ ఉంటుందని అన్నారు. కొడుకులిద్దరూ తనకు రెండు కళ్లలాంటి వారని, వారి భవిష్యత్‌ను నిర్ణయించుకునే హక్కు వారికుందని స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి సంజయ్ తన తండ్రి డీఎస్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నసందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా డీఎస్ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలున్నాయని పుకార్లు వస్తున్నాయి. మరి, డీఎస్ కామెంట్స్ పై కేసీఆర్ స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.