ఏపీలో పరిషత్ ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ స్టేను సవాల్ చేస్తూ ఏపీ సర్కార్, ఎస్ఈసీ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించడంతో…ఎన్నికలు యథావిధిగా ఏప్రిల్ 8న నిర్వహించుకోవచ్చంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ సంచలన తీర్పునిచ్చింది. అయితే, తదుపరి కోర్టు ఆదేశాలు వచ్చేవరకు కౌంటింగ్ ప్రక్రియ నిలిపివేయాని డివిజన్ బెంచ్ ఆదేశించింది.
ఈ నేపథ్యంలో ఈ తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు టీడీపీ సన్నద్ధమవుతోంది. న్యాయసలహా అనంతరం దేశపు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని యోచిస్తోంది.హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయంపై సంతృప్తికరంగా లేమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య అన్నారు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వెళ్తుంటే చూస్తూ ఊరుకోబోమని వర్ల రామయ్య చెప్పారు.
ఈ ఎన్నికల విషయంలో 4 వారాల వ్యవధి నిబంధన ఉల్లంఘనపై సుప్రీంకోర్టు తలుపు తడతామని ఆయన వెల్లడించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై టీడీపీ నేతలతో చంద్రబాబు చర్చించారని, పార్టీ ముఖ్యనేతల అభిప్రాయాలు స్వీకరించారని తెలిపారు. దీంతో, ఈ ఎన్నికల వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
కాగా, ఏపీలో రేపు జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 1,34,430 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 652 మంది ఆర్వోలు, 6,524 మంది మైక్రో అబ్జర్వర్లు, ఒక్కో జిల్లాకు ఒక్కో ఇన్చార్జి అధికారిని నియమించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కరోనా పాజిటివ్ ఓటర్ల కోసం పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచారు. కరోనా పాజిటివ్ వ్యక్తులకు చివరి గంటలో ఓటు వేసేందుకు అనుమతిస్తారు.