ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. జనసేన తరఫున నాగబాబు నామినేషన్ దాఖలు చేయగా..తాజాగా టీడీపీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించింది. బీటీ నాయుడు, బీద రవిచంద్ర, కావలి గ్రీష్మలకు ఎమ్మెల్సీ టికెట్ లను కేటాంయించింది టీడీపీ హై కమాండ్. అయితే, పొత్తులో భాగంగా తన ఎమ్మెల్యే సీటును జనసేనాని పవన్ కు వదులుకున్న టీడీపీ నేత వర్మ ఎమ్మెల్సీ ఎన్నికలపై గంపెడాశలు పెట్టుకున్నారు.
అయితే, జాబితాలో తన పేరు లేకపోవడంతో ఎమ్మెల్యే వర్మ అసహనం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ కోసం కష్టపడ్డా తనకు న్యాయం జరగలేదని అనుచరుల దగ్గర వర్మ వాపోయారని పుకార్లు వస్తున్నాయి. దీనంతటికీ జనసేన కారణమని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేనపై బురద వేయడం తగదని ఆ పార్టీ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది.
వర్మకు ఎమ్మెల్సీ సీటు రాకుండా జనసేన పార్టీ అడ్డుకుంటోందని కొందరు దుష్ప్రచారం చేసి కూటమి ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని జనసేన ఆ ప్రకటనలో పేర్కొంది. వర్మకు ఉన్నత స్థానం కల్పించమని పవన్ ఏనాడో చెప్పారని తెలిపింది. టీడీపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో తుది నిర్ణయం సీఎం చంద్రబాబుదని, ఆ నిర్ణయాలలో జనసేన జోక్యం చేసుకోబోదని పేర్కొంది. రెండు పార్టీల మధ్య పొత్తు స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగుతోందని, దానిని దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్న విషయాన్ని గమనించాలని కోరింది.