ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన సీట్ల ప్రక్రియను టీడీపీ అధినేత, కూటమి ప్రభుత్వనాయకుడు చంద్రబాబు తాజాగా ఖరారు చేశారు. వీరిలో ఒక ఎస్సీ, ఇద్దరు బీసీలకి మొత్తగా మూడు స్థానాలను టీడీపీ తరఫున ఆయన ప్రకటించారు. వాస్తవానికి ఏపీలో 5 ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. అయితే.. మిత్రపక్షాలైన జనసేనకు ఒక సీటు ను చంద్రబాబు ఇప్పటికే ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సీటులో జనసేన నాయకుడు నాగబాబు నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక, బీజేపీకి ఒకస్థానాన్ని కేటాయించారు. దీనిపై ఆ పార్టీ ఇంకా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.
ఇదిలావుంటే.. టీడీపీలో ముగ్గురికి అవకాశం కల్పించిన చంద్రబాబు ఒక ఎస్సీ, ఇద్దరు బీసీలకు అవకాశం ఇచ్చారు. వీరిలో 2023 మహానాడులో తొడగొట్టి వైసీపీకి సవాల్ రువ్విన కావలి గ్రీష్మకు ఖరారు చేశారు. ఈమె.. మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి కుమార్తె కావడం గమనార్హం. ప్రస్తుతం నామినేటెడ్ పదవిలోనూ ఉన్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించిన గ్రీష్మకు.. అప్పట్లో చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఊహించని విధంగా గ్రీష్మకు పట్టం కట్టారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఆమె గెలుపు ఖాయం.
ఇక, బీసీ కోటాలో నెల్లూరు జిల్లాకు చెందిన బీద రవి చంద్రయాదవ్కు చంద్రబాబు అవకాశం కల్పించారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న బీద కుటుంబం టీడీపీతో కలిసి ముందుకుసాగుతోంది. గతంలో బీద మస్తాన్ రావు.. వైసీపీ వైపు మళ్లి రాజ్యసభ సీటును తెచ్చుకున్నా.. వైసీపీ ఓటమి తర్వాత.. ఆయన కూటమి ఆ పదవిని వదులుకు సైకిల్ ఎక్కారు. ఇక, బీద రవిచంద్ర యాదవ్ కూడా.. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ను ఆశించారు. అదేవిధంగా బీసీ కోటాలో పార్టీ సీనియర్ నాయకుడు బీటీ నాయుడుకు చంద్రబాబు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ టికెట్‌ను ఇవ్వడం గమనార్హం. కాగా.. సోమవారంతో నామినేషన్ల పర్వం ముగియనుండగా.. ఈ నెల 20న ఎమ్మెల్యేలకు ఎన్నికల పోలింగ్ జరగనుంది.