ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో న్యూజిలాండ్ ను భారత జట్టు చిత్తు చేసి ముచ్చటగా మూడోసారి టైటిల్ కైవసం చేసుకుంది. 2013లో ధోనీ సారథ్యంలో ఈ టోర్నీలో విజేతగా నిలిచిన భారత్.. 2017లో పాకిస్థాన్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఈ సారి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన రోహిత్ సేన కప్ కొట్టింది. 2000 సంవత్సరంలో భారత్‌ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన న్యూజిలాండ్ పై పాతికేళ్ల పగను టీమిండియా తీర్చుకుంది.
2023లో ఐసీసీ నిర్వహించిన వన్డే క్రికెట్ ప్రపంచ కప్, 2024లో ఐసీసీ నిర్వహించిన టీ20 క్రికెట్ ప్రపంచ కప్, తాజాగా ఐసీసీ నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీ…ఇలా ఈ మూడు టోర్నీలలో మొత్తం 24 మ్యాచ్ లు ఆడిన టీమిండియా 23 మ్యాచ్ లలో విజయం సాధించి అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లన్నింటికీ రోహిత్ శర్మ కెప్టెన్ కావడం విశేషం. అయితే, ఈ టోర్నీ తర్వాత హిట్ మ్యాన్ రోహిత్, ఆల్ రౌండర్ జడేజా రిటైర్ అవుతారని ప్రచారం జరిగింది. కానీ, మ్యాచ్ తర్వాత తన రిటైర్మెంట్ పై రోహిత్ క్లారిటీనిచ్చాడు. తాను రిటైర్ కావడం లేదని, ఆ పుకార్లు నమ్మొద్దని తేల్చి చెప్పాడు.
కానీ, తర్వాతి వన్డే ప్రపంచకప్ 2027 చివర్లో జరగబోతోంది. అప్పటి అవసరాలకు అనుగుణంగా రోహిత్, కోహ్లీ ను వాడుకునేలా టీమ్ మేనేజ్ మెంట్ ప్రణాళికలు రూపొందించే అవకాశముంది. కెప్టెన్సీ నుంచి రోహిత్ ను తొలగించి ఆటగాడిగా సేవలందించాలని కోరే చాన్స్ ఉంది. యువ క్రికెటర్లను తదుపరి ప్రపంచకప్ నకు సిద్ధం చేసేలా ప్లాన్ చేసే అవకాశముంది. మరో రెండేళ్లు ఆడే సత్తా ఉన్న క్రమంలో రోహిత్, కోహ్లీ 2027 వన్డే ప్రపంచ కప్ ఆడి రిటైరయ్యే చాన్స్ ఉంది.