2018 లో పెను సంచలనం రేపిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో నేడు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. బీహార్ కు చెందిన నేరస్తుడు సుభాష్ కుమార్ శర్మ ఈ కేసులో ఏ2గా ఉన్నాడు. ప్రణయ్ హత్యలో కీలక పాత్ర పోషించిన అతనికి కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగతా నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ న్యాయస్థానం తుది తీర్పును వెల్లడించింది. తీర్పు సమయంలో శిక్ష తగ్గించాలని, తమకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని కొందరు నిందితులు న్యాయమూర్తిని వేడుకున్నారు.
మరోవైపు తనకు ముగ్గురు పెళ్లికాని పిల్లలు ఉన్నారని.. ఈ కేసుతో తనకు సంబంధం లేదని అమృత బాబాయి శ్రవణ్ కుమార్ పేర్కొన్నాడు. ప్రణయ్ హత్య కేసులో ఏ1గా ఉన్న అమృత తండ్రి మారుతిరావు 2020 మార్చిలో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. కాగా, 2018 జనవరిలో ప్రణయ్, అమృత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తన కూతురు అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడన్న కక్షతో మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు 2018 సెప్టెంబర్ 14న అల్లుడు ప్రణయ్‌ను సఫారీ గ్యాంగ్ తో హత్య చేయించాడు.
ప్రెగ్నెంట్ గా ఉన్న భార్య అమృతనుమిర్యాలగూడలోని ఆస్పత్రికి తీసుకువెళ్లి, తిరిగి వస్తుండగా ప్రణయ్‌పై దుండగులు అతి దారుణంగా కత్తులతో దాడి చేశారు. ప్రణయ్ అక్కడిక్కడే మృతి చెందాడు. అప్పట్లో ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. 2019లో ఎనిమిది మందిని నిందుతులగా పేర్కొంటూ ఛార్జిషీటు ఫైల్ చేశారు.
ఏ1గా మారుతీరావు, ఏ2గా బీహార్‌కు చెందిన సుభాష్‌శర్మ, ఏ3గా అస్గర్ అలీ, ఏ4గా అబ్ధుల్‌బారీ, ఏ5గా ఎం.ఏ కరీం, ఏ6గా తిరునగరు శ్రవణ్‌కుమార్, ఏ7గా శివ, ఏ8గా నిజాం నిందితులుగా పోలీసులు చార్జిషీట్లో పేర్కొని కోర్టుకు సమర్పించారు. వీరిలో మారుతీరావు చనిపోగా.. సుభాష్ శర్మ, అస్గర్ అలీ బెయిల్ రాక జైలులోనే ఉన్నారు. మిగతా నిందితులు బెయిల్‌పై బయటకు వచ్చాకు. ఇక సుమారు ఐదేళ్ల నుంచి నల్గొండ కోర్టులో ఈ కేసుపై విచారణ సాగగా.. ఇటీవలె వాదనలు ముగిశాయి. నేడు జడ్జి రోజారమణి ముద్దాయిలకు శిక్షలు విధించడంతో.. ప్రణయ్ కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.