తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికలకు సంబంధించి.. కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. మండలికి వెళ్లేందుకు ఈ పార్టీ తరఫు న చాలా మంది ఆశావహులు పోటీలో ఉన్నప్పటికీ.. చివరకు అధిష్టానం తన అభీష్టానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తాజాగా ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా.. అధికార పార్టీ కాంగ్రెస్‌కు 3 స్థానాలు దక్కనున్నాయి. ఈ క్రమంలో అనూహ్యంగా అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా పోటీ ఎక్కువగానే కనిపించింది.
దీంతో సుదీర్ఘ కసరత్తు చేసిన పార్టీ అధిష్టానం ఆదివారం రాత్రి ప్రకటన జారీ చేసింది. వీరిలో ప్రముఖ నటి, నాయకురాలు.. విజయశాంతికి పార్టీ సీటు ఖరారు చేసింది. అదేవిధంగా అద్దంకి దయాకర్‌రావుకు ఎస్సీ కోటాలో సీటు ఇవ్వడం గమనార్హం. అదేవిధంగా ఎస్టీ కోటాలో శంకర్ నాయక్‌కు సీటు ఇచ్చారు. ఈ మూడు స్థానాల్లోనూ నాయకులు ఖరారు కావడంతో సోమవారం నామినేషన్ ఘట్టం పూర్తి కానుంది. అయితే.. మిగిలిన ఆశావహుల పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు అధిష్టానానికి ప్రశ్నగా మారనుంది. ఇదిలావుంటే.. మొత్తం ఐదు స్థానాల్లో మూడు కాంగ్రెస్ పార్టీకి రానుండగా.. రెండు మాత్రం బీఆర్ ఎస్‌కు దక్కనున్నాయి.
అయితే.. కొందరు ఎమ్మెల్యేలు బీఆర్ ఎస్ పార్టి నుంచి బయటకు రావడం.. కాంగ్రెస్‌కు జై కొట్టిన నేపథ్యంలో వారి ఓటు ఎటు పడుతుందన్నది ప్రశ్న. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు దాఖలు చేసుకునే వెసులు బాటు ఉంటుంది. ఇదిలావుంటే.. బీఆర్ ఎస్ తరఫున ఎవరిని ఎంపిక చేస్తారన్నది కూడా ఆసక్తిగా మారింది. మరోవైపు ఎంఐఎం కూడా తన అభ్యర్థిని ప్రకటించనున్నది. కాగా.. సుదీర్ఘ కాలం గ్యాప్ తర్వాత విజయశాంతి శాసన మండలిలో అడుగు పెట్టనుండడం గమనార్హం. అయితే.. చిత్రం ఏంటంటే.. విజయశాంతి స్థానిక నాయకులను కాకుండా.. ఏకంగా అధిష్టానం నుంచే సీటును కైవసం చేసుకోవడం గమనార్హం.