హీరోగా అరంగేట్రం చేసి.. అందులో కలిసిరాక, ఆ తర్వాత విలన్ వేషాల్లో సత్తా చాటుకుని.. తిరిగి హీరోగా మారి మంచి స్థాయి అందుకున్న నటుడు గోపీచంద్. ‘యజ్ఞం’ మొదలుకుని.. ‘లౌక్యం’ వరకు తన కెరీర్లో పెద్ద హిట్లే పడ్డాయి ఒక దశ వరకు. కానీ గత పదేళ్లుగా సరైన విజయం లేక గోపీ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు.
తన చివరి చిత్రం ‘విశ్వం’ మీద పెట్టుకున్న ఆశలు కూడా ఫలించలేదు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కూడా ఫెయల్యూర్గానే నిలిచింది. అంతకు ముందు వచ్చిన ‘రామబాణం’ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సినిమాకు సినిమాకు మధ్య గ్యాప్ తీసుకుని ఆచితూచి అడుగులు వేస్తున్నా సరే గోపీ రాత మారట్లేదు. ఇలాంటి టైంలో తన ఇమేజ్‌కు భిన్నంగా ఓ సినిమాను ఎంచుకుని ప్రయోగానికి సిద్ధమయ్యాడు గోపీచంద్.
‘ఘాజీ’ సినిమాతో ఆశ్చర్యపరిచిన యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డితో గోపీ ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ రోజే శ్రీకారం చుట్టుకుంది. ఇంతకుముందు గోపీతో ‘సీటీమార్’ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని కూడా నిర్మిస్తున్నాడు. ‘సీటీమార్’ ఓ మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత ఆయన ది వారియర్, కస్టడీ, స్కంద చిత్రాలతో షాక్‌లు తిన్నాడు. ‘నా సామి రంగ’ కొంచెం ఊరటనిచ్చింది.
సంకల్ప్ ‘ఘాజీ’ తర్వాత తడబడ్డాడు. ‘అంతరిక్షం’ ఆడలేదు. హిందీలో చేసిన ‘ఐబీ 71’ కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఈసారి గోపీ కోసం అతను ఓ భారీ కథనే రెడీ చేశాడు. ఇది 7వ శతాబ్దం నేపథ్యంలో నడిచే చారిత్రక కథ అట. గోపీ ఇంతవరకు ఇలాంటి హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమా చేయలేదు. తన మార్కెట్ బాగా దెబ్బ తిన్నాసరే.. పెద్ద బడ్జెట్లోనే ఈ సినిమా చేయబోతున్నారట. గోపీ కెరీర్‌ను కచ్చితంగా మలుపు తిప్పే సినిమా ఇదవుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.