మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు తెలుగు ప్రజలందరికీ సుపరిచితులే. ఇటు సినీ రంగంలో చిరంజీవి సోదరుడిగా…అటు రాజకీయ రంగంలో పవన్ కు అన్నగా ఆయన రాణిస్తున్నారు. ఇటు అన్నయ్యకు..అటు తమ్ముడికి తన వంతు మద్దతు తెలుపుతూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా జనసేనలో పవన్ కు ముందు నుంచి నాగబాబు చేదోడువాదోడుగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవికి, పవన్ కు నాగబాబు అప్పు ఉన్నారన్న సంగతి వెల్లడై హాట్ టాపిక్ గా మారింది.
నామినేషన్ పత్రాలలో తన ఆస్తులు, అప్పుల వివరాలను నాగబాబు వెల్లడించారు. అన్నయ్య చిరు దగ్గర 28,48,871 రూపాయలు, తమ్ముడు పవన్ దగ్గర రూ. 6.9 లక్షల అప్పు చేసినట్లు నాగబాబు అఫిడవిట్ లో పేర్కొన్నారు. రెండు బ్యాంకుల్లో రూ. 56.97 లక్షల హౌస్ లోన్, రూ. 7,54,895 కార్ లోన్ ఉన్నాయని, ఇతర వ్యక్తుల వద్ద రూ.1.64 కోట్ల అప్పు ఉందని తెలిపారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని అఫిడవిట్లో వెల్లడించారు.
మ్యూచువల్ ఫండ్స్/బాండ్ల రూపంలో రూ. 55.37 కోట్లు పెట్టుబడి పెట్టారు నాగబాబు. చేతిలో రూ. 21.81 లక్షలు, బ్యాంకులో రూ. 23.53 లక్షలు నగదు ఉంది. ఇతరులకు ఆయన రూ. 1.03 కోట్లు అప్పు ఇచ్చారు. రూ. 67.28 లక్షల విలువైన బెంజ్‌కారు, రూ. 11.04 లక్షల విలువైన హ్యుండాయ్ కారు ఉన్నాయి. రూ. 18.10 లక్షల విలువైన 226 గ్రాముల బంగారం, రూ. 16.50 లక్షల విలువైన 55 క్యారెట్ల వజ్రాలు, రూ. 57.90 లక్షల విలువైన 724 గ్రాముల బంగారం, రూ. 21.40 లక్షల విలువైన 20 కేజీల వెండి తన భార్య వద్ద ఉన్నాయని అఫిడవిట్ లో వెల్లడించారు. తనకు, తన భార్యకు కలిపి రూ. 59.12 కోట్ల చరాస్తులు ఉన్నాయని తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలో వేర్వేరు చోట్ల రూ. 3.55 కోట్ల విలువైన 2.39 ఎకరాల భూమి, మెదక్ జిల్లా నర్సాపూర్‌లో రూ. 32.80 లక్షల విలువైన 3.28 ఎకరాలు, రూ. 50 లక్షల విలువ చేసే ఐదెకరాలు, రంగారెడ్డి జిల్లా టేకులపల్లిలో రూ. 53.50 లక్షల విలువైన 1.07 ఎకరాల భూమి నాగబాబు స్థిరాస్తులు. హైదరాబాద్‌లోని మణికొండలో రూ. 2.88 కోట్ల విలువైన 460 చదరపు అడుగుల రెసిడెన్షియల్ విల్లా కలిపి మొత్తంగా రూ. 11.20 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు.