ఏపీలో ఇప్పటి వరకు జరిగిన రాజకీయాలు వేరు.. ఇక నుంచి జరగనున్న రాజకీయం వేరు.. అన్నట్టుగా పొలిటికల్ సీన్ మారుతోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇప్పటి వరకు టీడీపీని మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా తీసుకున్న వైసీపీ ఎదురు దాడి చేయడం.. కేసులు పెట్టడం ద్వారా నాయకులకు షాకిస్తోందనే చెప్పాలి. దీంతో సగం మంది టీడీపీ నాయకులు మనకెందుకీ గొడవ! అనుకుని తప్పుకొంటున్నారు. ఏదో చంద్రబాబు వస్తే.. ఆయా కార్యక్రమాల్లో పాల్గొని తప్పించుకుంటున్నారు.
ఈ విషయంపైనే చంద్రబాబు పార్టీ నేతలకు క్లాస్ ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు భారీ మార్పుకనిపిస్తోంది. నాయకులు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు ఎక్కు పెడుతున్నారు. ఇక, దీనికితోడు జనవరి నుంచి నారా లోకేష్ పాదయాత్ర కు రెడీ అవుతున్నారు.
జిల్లాల్లో ఆయన పాదయాత్ర సందర్భంగా ఖచ్చితంగా రాజకీయ వేడి రాజుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పైగా.. సుదీర్ఘకాలం అంటే.. దాదాపు 15 నెలల పాటు ఈ యాత్ర సాగనుంది. దీనిని రాజకీయంగా టీడీపీ వేడెక్కించే ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది.
ఇక, రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు కూడా పర్యటించాలని నిర్ణయించారు. ఉత్తరాంధ్ర సహా సీమ ప్రాంతాల్లో ఆయన షెడ్యూల్ ఖరారు కానుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు ప్రభుత్వ పథకాలను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు చూసిన చంద్రబాబు వేరు.. ఇక నుంచి చూడబోయే చంద్రబాబు వేరు అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కొక్క పథకంపైనా చంద్రబాబు నిశితంగా తూర్పారబడుతున్నారు.
క్షేత్రస్థాయిలో పరీశీలనలు చేస్తున్నారు. అదేసమయంలో పార్టీ నేతలను కూడా రంగంలోకి దింపుతూ.. ప్రభుత్వ అవినీతి, నేతల తీరుపై తీవ్రస్థాయిలో ఉద్యమించేలా పక్కా ప్లాన్, టైమింగ్తో చంద్రబాబు వ్యూహత్మకంగా ముందుకు సాగుతున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీకి రాజకీయంగా ఒక సంకట పరిస్థితి ఎదురు కానుందని అంటున్నారు.
ఈ పరిణామాలను గమనిస్తున్న వైసీపీ నేతలు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవనే ఒక సంకట స్థితిని ఎదుర్కొంటుండడం గమనార్హం.