2024 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని టీడీపీ అధినేత చంద్రబాబు పక్కా ప్రణాళికతో ముందుకుపోతున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల సమయం ఉన్నప్పటకీ…2022 సంవత్సరం టీడీపీకి ఎంతో కీలకమన్న భావనలో చంద్రబాబు ఉన్నారు. ఈ క్రమంలోనే మిషన్ 2022కు చంద్రబాబు శ్రీకారం చుట్టాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిరసన ప్రదర్శనలు చేపట్టాలని సమర శంఖం పూరించారు.
ఎవ్వరినీ వదిలి పెట్టకుండా ప్రభుత్వవం వేధిస్తోందని, బాధితుల తరఫున టీడీపీ పోరాడుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ నేతల మోసాలను ఎండగట్టాలని, వారి తప్పులను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
టీడీపీ తరఫున నియోజకవర్గాల్లో నిరసనలు తెలపాలని, మహానాడు నిర్వహించే వరకు వరుస కార్యక్రమాలు చేపట్టాలని కార్యకర్తలకు, నేతలకు పిలుపునిచ్చారు.
ఈ నెల 8న రైతుల సమస్యలపై పోరాటం జరపాలని, ఈ నెల 18న టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. టీడీపీకి 2022 సంవత్సరం చాలా ముఖ్యమని, పార్టీ తరఫున ఏం చేసినా ఈ ఏడాదే చేయాలని అన్నారు.
వచ్చే ఏడాది ఎన్టీఆర్ పుట్టి వందేళ్లు పూర్తవుతుందని, ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పార్టీ కార్యకర్తలంతా ముందుకు వెళ్లాలని, నాయకులు ధైర్యంగా లేకుంటే కార్యకర్తలు డీలా పడతారని చెప్పారు.
తమిళనాడులో అమ్మ క్యాంటీన్లను స్టాలిన్ కొనసాగిస్తోంటే, ఏపీలో అన్న క్యాంటీన్లను జగన్ తీసేసి పేదలను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని అంశాలపై ప్రణాళికలు వేసుకుని పోరాడాలని టీడీపీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
నియోజక వర్గాల్లో పోరాడకుంటే ఫలితాలుండబోవని దిశా నిర్దేశం చేశారు. ఈ ఏడాది పూర్తయితే…వచ్చే ఏడాది నుంచి ఎన్నికల హడావుడి మొదలవుతుందని అన్నారు. అందుకే, ఈ ఏడాది చాలా కీలకమని చెప్పారు.