అమరరాజా బ్యాటరీస్ అధినేత, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ను సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం కొద్ది సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతోన్న సంగతి తెలిసిందే. చిత్తూరులోని అమరరాజా బ్యాటరీల తయారీ కంపెనీ కాలుష్యం వెదజల్లుతోందంటూ ఇబ్బంది పెట్టిన వైనం అప్పట్లో సంచలనం రేపింది. ఆ దెబ్బకు తన ఫ్యాక్టరీ విస్తరణను గల్లా తెలంగాణకు మార్చారు. ఈ క్రమంలోనే తాజాగా తన వ్యాపారాల కోసం, తన పరిశ్రమలలోని ఉద్యోగుల బాగు కోసం గల్లా జయదేవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని గల్లా జయదేవ్ సంచలన ప్రకటన చేశారు.
రాజకీయ నాయకులైన వ్యాపారవేత్తలపై ప్రభుత్వాలు కక్ష సాధించకూడదని పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. వ్యాపారాలు, రాజకీయాలు..రెండింటికీ న్యాయం చేయలేక రాజకీయాలకు బ్రేక్ ఇస్తున్నానని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని, కానీ, టీడీపీలో కొనసాగుతానని అన్నారు. తాత రాజగోపాల్ నాయుడు, తల్లి గల్లా అరుణ రాజకీయ వారసుడిగా ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. తనకు టికెట్ ఇచ్చిన చంద్రబాబుకు, రెండు సార్లు ఎంపీగా గెలిపించిన గుంటూరు ప్రజలకు జయదేవ్ కృతజ్ఞతలు చెప్పారు.
అయితే, గత మూడు సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో లేనని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు టీడీపీ తరఫున పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు గారికి కృతజ్ఞతలు చెప్పారు. చిత్తూరులోనే అన్ని వ్యాపారులు పెట్టడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని, ఆ తర్వాత తెలంగాణ, తమిళనాడుతోపాటు విదేశాల్లో కూడా పరిశ్రమలు పెడుతున్నామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భయపడాల్సిన పనిలేదని చెప్పారు. మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే ఫుల్ టైం రాజకీయ నాయకుడిగానే వస్తానని గల్లా చెప్పారు.