ఏపీలో పెంచిన విద్యుత్ చార్జీలపై విపక్ష నేతలు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఓ పక్క కరెంటు కోతలు, మరో పక్క విద్యుత్ చార్జీల వాతలతో వేసవి కాలంలో జనాన్ని నానా తిప్పలు పెడుతున్నారని వారు మండిపడుతున్నారు. ఇంటిపన్నులు.. చెత్త పన్నులు.. ఇపుడు ఏడోసారి కరెంటు ఛార్జీలు భారీగా పెంచేశారంటూ టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ వైఖరికి నిరసనగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొద్ది రోజుల క్రితం వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
విద్యుత్చార్జీలను భారీగా పెంపునకు నిరసనగా ఉండవల్లి కరకట్ట వద్ద వున్న తన నివాసం వద్దనుంచి లాంతరు చేతపట్టుకుని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి ర్యాలీగా వచ్చారు. తమ పాలనలో పండుగలనాడు ప్రజలకు పండుగ కానుకలిస్తే.. జగన్రెడ్డి మాత్రం ఈ ఉగాది కానుకగా రాష్ట్ర ప్రజలకు విద్యుత్ ఛార్జీలను పెంచారంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మరో టీడీపీ నేత…జగన్ తీరుకు నిరసనగా చేపట్టిన వినూత్న కార్యక్రమం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా కడప జిల్లా రైల్వేకోడూరులో టీడీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారెడ్డి వినూత్న నిరసన తెలిపారు. రైల్వేకోడూరులోని వీధుల్లో తోపుడు బండిపై లాంతర్లు, విసన కర్రలు తోసుకుంటూ వెళ్లి నిరసన తెలిపారు. కరెంటు కోతలతో అల్లాడుతున్న జనానికి ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ట్యూబ్లైట్లు తీసుకొని..లాంతర్లు చేతికిచ్చి వినూత్న నిరసన తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.