ఏపీలో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోన్న సంగతి తెలిసిందే. రోజుకు 20వేలకు పైగా కేసులు నమోదవుతున్న ఏపీలో 7 జిల్లాలు జాతీయ స్థాయిలో రెడ్ జోన్ లో ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓ వైపు కరోనా విలయతాండవం చేస్తున్నప్పటికీ సీఎం జగన్ మాత్రం కక్ష సాధింపు రాజకీయాలతో సమయం వృథా చేస్తున్నారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఆయనతో పాటు సహకార శాఖ మాజీ అధికారి గురునాథానికి కూడా సిటీ స్కాన్ తీయించగా ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని తేలింది. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ధూళిపాళ్లను విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ధూళిపాళ్లకు కరోనా చికిత్స అందిస్తున్నారు.
జైలులో ఉన్న నరేంద్ర జ్వరం, జలుబుతో బాధపడుతుండగా ….ఆయన కుటుంబ సభ్యులు న్యాయవాది ద్వారా కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాలతో నరేంద్రకు వైద్య పరీక్షలు, కరోనా టెస్ట్ చేయించగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఇప్పటికే సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణ కూడా కరోనా బారినపడి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ముగ్గురినీ సంగం డెయిరీకి సంబంధించిన స్థల వివాదంలో అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ కు పంపిన సంగతి తెలిసిందే.