ఏపీ డిప్యూటీ సీఎంగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టనున్నారంటూ ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ శ్రేణులు టీడీపీలో నెంబర్ 2గా ఉన్న లోకేష్‌ను ప్రభుత్వంలోనూ అదే స్థాయిలో చూడాలని ఆకాంక్షిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా లోకేశ్ ను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి విజయంలో లోకేష్ పాత్ర కూడా ఎంతో ఉంది. యువగళం పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమై పార్టీని, పార్టీ శ్రేణులను బలోపేతం చేయడంలో లోకేశ్ సక్సెస్ అయ్యారు.
కూటమి అధికారంలోకి వచ్చాక ఐటీ, పరిశ్రమలు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలను తీసుకొని దూసుకుపోతున్నారు. అయితే చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రి పదవి లోకేశ్ కే దక్కాలంటే ఈ నాలుగున్నర ఏళ్లు చాలా కీలకం. పార్టీలో మరియు పాలనలో లోకేశ్ మార్క్ కనిపించేలా చేయాలి. అది జరగాలంటే వీలైనంత త్వరగా లోకేశ్ కు ఉపముఖ్యమంత్రి బాధ్యతలు అప్పజెప్పాలి. ఆ తర్వాత సీఎం అయ్యేందుకు లైన్ క్లియర్ అవుతుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు.
అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్కరే డిప్యూటీ సీఎం ఉండాలని పవన్ కళ్యాణ్ ప్రతిపాదన తేవడంతో.. అందుకు చంద్రబాబు అంగీకరించారు. డిప్యూటీ సీఎంగా పవన్ నే నియమించారు. కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ అన్ని సమస్యలపై స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. పరిపాలన, కొత్త కార్యక్రమాల ద్వారా హైలెట్ అవ్వడమే కాకుండా తిరుపతి లడ్డూ వ్యవహారం, ఇటీవల ప్రధాని పర్యటన తదితర అంశాల్లో కీలకంగా పవన్ భారీ క్రేజ్ తెచ్చుకున్నారు.
ఇంకా చెప్పాలంటే గడిచిన ఆరేడు నెలల్లో చంద్రబాబు కన్నా పవన్ కళ్యాణ్‌నే ఎక్కవ కనపడుతున్నారు. ఆయన గ్రాఫ్ అంతకంతకు పెరిగిపోతోంది. రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా మారతాయో అని ఆందోళన చెందుతున్న టీడీపీ శ్రేణులు.. పార్టీ భవిష్యత్తు కోసం వీలైనంత వేగంగా లోకేశ్‌ను ఫ్రంట్ రన్లో తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తున్నారట. మరి లోకేశ్ కు డిప్యూటీ సీఎం ప్రతిపాదన వస్తే పవన్ కళ్యాణ్ పరిస్థితేంటి..? అందుకు ఆయన ఎలా రియాక్ట్ అవుతారు..? అన్నది చూడాలి.